అమరావతి: తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు చంద్రబాబు ప్రభుత్వం షాకిచ్చింది. టీటీడీ పాలకమండలి సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమల తిరుపతి దేవ స్థానం పాలకమండలి సభ్యుడిగా సండ్ర వెంకట వీరయ్యను సీఎం చంద్రబాబు నాయుడు ఎంపిక చేశారు. 

పాలకమండలి సభ్యుడిగా అవకాశం కల్పించి దాదాపు రెండు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు బాధ్యతలు తీసుకోకపోవడంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. నిబంధనల ప్రకారం నెలరోజుల్లో బాధ్యతలు స్వీకరించాల్సిన సండ్ర వెంకట వీరయ్య ఇప్పటి వరకు స్వీకరించకపోవడాన్ని తప్పు బడుతూ ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసింది. 

ఇకపోతే టీటీడీ పాలక మండలి సభ్యుడిగా సండ్ర వెంకట వీరయ్య గతంలో కూడా పనిచేశారు. ఇది రెండో సారి. నిబంధనలు తెలిసినా కూడా బాధ్యతలు స్వీకరించకపోవడంపై తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతుంది. 

మరోవైపు సండ్ర వెంకట వీరయ్య టీఆర్ఎస్ పార్టీలో చేరతారంటూ ప్రచారం జరుగుతుంది. అందువల్లే టీటీడీ పాలకమండలి సభ్యుడిగా బాధ్యతలు తీసుకోవడం లేదని ప్రచారం జరుగుతుంది. మరి చంద్రబాబు ఇచ్చిన ఝలక్ పై ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.