హైదరాబాద్‌: సినీనటుుడు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు హరికృష్ణ మృతి తమ కుటుంబానికి తీరని లోటు అని ఆయన బావ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. హరికృష్ణ మృతిపై చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హరికృష్ణ రోడ్డు ప్రమాద విషయం తెలుసుకున్న చంద్రబాబు వెంటనే ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్ లోని ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆస్పత్రికి తరలించినా కాపాడుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. 

హరికృష్ణ మృతి తెలుగుదేశం పార్టీకే కాదు రాష్ట్రానికే తీరని లోటున్నారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదన్నారు. నటుడిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని, సాంఘిక ,పౌరాణిక, చారిత్రక పాత్రల పోషణలో హరికృష్ణది అందెవేసిన చేయి అని కొనియాడారు. చలనచిత్ర రంగానికి, రాజకీయ రంగానికి హరికృష్ణ ఎన్నో సేవలందించారన్నారు. 

దివంగత సీఎం ఎన్టీఆర్ కు హరికృష్ణ అత్యంత ఇష్టుడు అని, ఎన్టీఆర్‌ చైతన్య రథసారథిని స్వయంగా డ్రైవింగ్‌ చేస్తూ ఎన్టీఆర్‌ను ప్రజలకు చేరువ చేశారని సీఎం చంద్రబాబు నాయుడు గుర్తుచేశారు. నిరాడంబరుడు, నిగర్వి, స్నేహానికి మారుపేరు అయిన హరికృష్ణను కోల్పోవడం బాధాకరమన్నారు.