హైదరాబాద్: బిజెపి చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ తో తెలంగాణ కాంగ్రెసు తీవ్రంగా దెబ్బ తింటోంది. పలువురు నేతలు బిజెపి వైపు చూస్తున్నారు తాజాగా మరో కీలక నేత కూడా బిజెపిలో చేరేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది.  మాజీ మంత్రి డాక్టర్ ఎ. చంద్రశేఖర్ బిజెపిలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 

కాంగ్రెసుకు రాజీనామా చేసి బిజెపిలో కీలక పదవిని పొందిన డికె ఆరుణ ఆపరేషన్ ఆకర్ష్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె చంద్రశేఖర్ ఇంటికి వెళ్లి బిజెపిలోకి ఆహ్వానించారు. చంద్రశేఖర్ తో అరుణ చర్చలు దాదాపుగా ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ.యన త్వరలో బిజెపిలో చేరుతారని తెలుస్తోంది. 

బిజెపిలో చేరేందుకు చంద్రశేఖర్ ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లు చెబుతున్నారు. బిజెపి నాయకుల సమక్షంలో ఆయన వికారాబాదులో భారీ బహిరంగ సభ పెట్టి బిజెపిలో చేరుతారని అంటున్నారు. 

నిజానికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ తో ఆయనకు సత్సంబంధాలు ఉండేవి. ఆ సమయంలో టీఆర్ఎస్ లో ఆయన ఓ వెలుగు వెలిగారు. అయితే,  ఆ తర్వాతి పరిణామాల నేపథ్యంలో ఆయన కాంగ్రెసు పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ కూడా బిజెపిలో చేరుతారనే ప్రచారం సాగుతోంది.