బిల్లులపై కేసిఆర్ ప్రభుత్వ నిర్ణయం: తమిళిసైతో మరోసారి కయ్యం
కేసీఆర్ ప్రభుత్వం మరోసారి తెలంగాణ గవర్నర్ తమిళిసైతో కయ్యానికి దిగేందుకు సిద్ధపడింది. తమిళిసై వెనక్కి పంపిన మూడు బిల్లులు ఏ మాత్రం మార్చకుండా శాసనసభలో ఆమోదం పొంది తిరిగి పంపించాలని కేసిఆర్ ప్రభుత్వం నిర్ణయించింది.
హైదరాబాద్: గవర్నర్ తమిళిసైతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రభుత్వం మరోసారి కయ్యానికి కాలు దువ్వుతోంది. మూడు బిల్లులపై తమిళిసై నిర్ణయం కెసిఆర్ ప్రభుత్వం ఆగ్రహానికి కారణమైంది. వాటిని ఆమోదించకుండా తమిళిసై వెనక్కి పంపించారు. అయితే, వాటిని ఏ మాత్రం సవరించుకుండానే, మార్పులు చేయకుండానే తిరిగి గవర్నర్ ఆమోదానికి పంపించాలని కేసిఆర్ అధ్యక్షతన సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది.
దాంతో ఆ బిల్లులను ఈసారి ఆమోదించాల్సిన అనివార్యతలో తమిళిసై పడినట్లు భావిస్తున్నారు. అయితే, ఆమె నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగే అవకాశం మాత్రం ఉంది. గవర్నర్ బిల్లులను వెనక్కి పంపడంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్లు, ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వానికి అడ్డంకులు కల్పించడానికి గవర్నర్ ను కేంద్రం పావుగా వాడుకుంటోందని, అందులో భాగంగా గవర్నర్ బిల్లులను వెనక్కి పంపించారని మంత్రి కేటి రామారావు అన్నారు.
ఆ బిల్లులను శాసనసభ మళ్లీ ఆమోదించి పంపిస్తే వాటిని గవర్నర్ తప్పకుండా ఆమోదించాల్సి ఉంటుందని, గవర్నర్ కు మరో మార్గం లేదని కేటిఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాల (ఎస్టాబ్లిష్ మెంట్, నియంత్రణ) వరనణ బిల్లు 2022, తెలంగాణ మున్సిపల్ చట్టాలు (సవరణ) బిల్లు 2022, తెలంగాణ పంచాయతీరాజ్ (సవరణ) బిల్లు 2023లను గవర్నర్ ప్రభుత్వానికి వెనక్కి పంపించారు. వాటిని తిరిగి పరిశీలించాలని ఆమె సూచించారు.
ఆ మూడు బిల్లులను వర్షాకాలం శాసనసభా సమావేశాల్లో తిరిగి ప్రవేశపెట్టి ఆమోదం పొందాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 3వ తేదీ నుంచి వర్షాకాలం సమావేశాలు ప్రారంభం కానున్నాయి.