హైదరాబాద్: దేశం, ధర్మం కోసం పోరాడుతున్న తనపై కావాలనే అక్రమ కేసులు బనాయిస్తున్నారని గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. ఇలా కేసులు పెట్టడం ద్వారా తన రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలని కుట్రలు చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే తనపై తాజాగా అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు తనపై మరోకేసు నమోదుచేశారని రాజాసింగ్ తెలిపారు.  

తనపై ఎన్ని కేసులు పెట్టిన భయపడే ప్రసక్తేలేదని రాజాసింగ్ అన్నారు. వందలు, వేలల్లో కాదు లక్షల్లో కేసులు పెట్టినా తననేమీ చేయలేరని... తనపై పెట్టేవన్నీ అక్రమ కేసులే కాబట్టి భయపడేది లేదన్నారు. ఇలా అప్పుడొకటి ఇప్పుడొకటి కాదు మీరు టార్గెట్ గా పెట్టుకున్న కేసులన్నీ ఒకేసారి బుక్ చేయాలని సీఎం కేసీఆర్, హోంమంత్రి మహమూద్ అలీని కోరుతున్నానని అన్నారు రాజాసింగ్.  

ఇక ఐదేళ్ల నాటి బొల్లారం దాడి కేసులో రాజాసింగ్ కు ఇటీవల నాంపల్లి సెషన్స్ కోర్టు ఏడాది జైలు శిక్షను విధించిన విషయం తెలిసిందే.  అయితే ఈ విషయంపై ఆయన హైకోర్టును ఆశ్రయించగా విచారణ జరిపిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.  
 
పోలీసులపై దాడి దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణపై రాజాసింగ్ మీద 2015లో కేసు నమోదైంది. రాజాసింగ్ బీఫ్ ఫెస్టివల్ ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు ఆయనను అరెస్టు చేశారు కూడా. ఈ సందర్భంగా జరిగిన వాగ్వివాదంలో రాజాసింగ్ సీఐని దూషించారంటూ కేసు నమోదైంది. ఈ కేసులోనే అతడి నాంపల్లి కోర్టు ఏడాది జైలుశిక్ష విధించగా...హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది.