తెలంగాణలో కరోనా వైరస్ రోజు రోజుకు విస్తరిస్తోంది. ఇప్పటి  వరకు సామాన్యులే కోవిడ్ 19 బారినపడగా.. తాజాగా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు ఈ లిస్ట్‌లోకి ఒకరి తర్వాత మరోకరు చేరిపోతున్నారు.

తాజాగా హైదరాబాద్‌లో తాత్కాలిక సచివాలయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బీఆర్కే భవన్‌లో మరోసారి కరోనా కలకలం రేపింది. ఇప్పటికే కొందరు ఉద్యోగులు వైరస్ బారినపడటంతో సంబంధిత శాఖల కార్యాలయాలు మూతపడ్డాయి.

కరోనా భయంతో మిగిలిన శాఖల్లోనూ పరిమిత సంఖ్యలోనే ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా ఇటీవలే ఆర్ధిక శాఖలో ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఇద్దరు సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో ఆ శాఖలోని ఉద్యోగులెవరూ ఆఫీసుకు రావడం లేదు.

అత్యవసరమైతే తప్పించి మిగిలిన ఉద్యోగులు కూడా సచివాలయం వైపు తొంగిచూడటం లేదు. తాజాగా మైనార్టీ సంక్షేమ శాఖకు చెందిన ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు బీఆర్కే భవన్‌ ఎంట్రన్స్ వద్ద  థర్మల్ స్కానర్ కెమెరాలతో పరీక్షించాకే సిబ్బందిని లోపలికి అనుమతిస్తున్నారు.

జీహెచ్ఎంసీ సిబ్బంది తరచుగా కార్యాలయ ప్రాంగణాన్ని శానిటైజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు బీఆర్కే భవన్‌లో ఆరు కేసులు నమోదయ్యాయి. కాగా తెలంగాణలో గురువారం 352 మందికి పాజిటివ్‌గా తేలింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,027కి చేరింది.

గురువారం వైరస్ కారణంగా ముగ్గురు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 195కి చేరుకుంది. రాజధాని హైదరాబాద్‌లోనే 302 మందికి పాజిటివ్‌గా తేలడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది.

ఆ తర్వాత జనగాం 3, భూపాలపల్లి 2, ఖమ్మం 1, మహబూబ్‌నగర్ 2, మంచిర్యాల 4, మెదక్ 2, మేడ్చల్‌ 10, నల్గొండ 1, నిజామాబాద్ 2, రంగారెడ్డి 17, సంగారెడ్డి 2, వరంగల్ (రూ) 1, వరంగల్ (అ) 3 కేసులు నమోదయ్యాయి.  తెలంగాణలో 2,531 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, 3,301 మంది డిశ్చార్జ్ అయ్యారు.

కాగా, హైద్రాబాద్ సరోజిని ఆసుపత్రిలో పనిచేసే ఇద్దరు డాక్టర్లకు కరోనా సోకింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా సోకిన వైద్యుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నాయి.బుధవారం నాడు నిమ్స్ ఆసుపత్రిలో పనిచేసే వైద్య సిబ్బంది 66 మందికి కరోనా సోకింది. 26 మంది వైద్యులు, 40 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది.