హైదరాాబాద్: ఇవాళ(శుక్రవారం)జీహెచ్ఎంసీ పరిధిలో ఒకే సమయంలో 45 బస్తీ దవాఖానాలు ప్రారంభించేలా ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. హైదరాబాద్ -22, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 15, రంగారెడ్డి జిల్లాలో 05, సంగారెడ్డి జిల్లాలో 03 బస్తీ దవాఖానాలు ప్రారంభమవనున్నాయి.   

వివిధ ప్రాంతాల్లో వున్న ఈ బస్తీ దవాఖానాలను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, ఆర్థికమంత్రి హరీష్ రావు, హోం మంత్రి మహమూద్ అలీ, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ప్రభుత్వ విప్ ప్రభాకర్, మేయర్ బొంతు రాంమోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసి యోద్దిన్, స్థానిక ఎమ్మెల్యేలు, కర్పోరేటర్ల తో కలిసి ప్రారంభిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ వెల్లడించారు. 

ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 123 బస్తీ దవఖానాలు ప్రతిరోజూ 10 వేల మందికి వైద్య సేవలు అందిస్తున్నాయి. నూతనంగా ప్రారంభించే 45 బస్తీ దవాఖానాలతో  అదనంగా 4 వేల మందికి వైద్య సేవలు అందుతాయి. ఒక్కో బస్తీ దావఖానలో  ఒక వైద్యుడు, ఒక నర్స్, ఒక సహాయకుడు ఉంటారు. ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేసేందుకే ప్రభుత్వం బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసింది.

హైదరాబాద్ లోని నిరుపేద ప్రజలకోసం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానల్లో మెడికల్‌ ఆఫీసర్, స్టాఫ్‌ నర్సు పోస్టులను భర్తీ చేయనున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. నేషనల్ హెల్త్‌ మిషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఈ బస్తీ దవాఖానల్లో కనీస అర్హతగా ఎంబీబీఎస్‌ చేసి వారు తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌లో సభ్యులుగా నమోదైన వారు మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాడానికి అర్హులు అని తెలిపారు.

 మెడికల్‌ ఆఫీసర్‌కు వేతనంగా నెలకు రూ.42వేల  ఇవ్వనున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ నర్సింగ్‌, జీఎన్‌ఎం పూర్తి చేసి తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్న వారు స్టాఫ్‌ నర్సు పోస్టులకు దరఖాస్తు చేసుకోడానికి అర్హులని తెలిపారు.

స్టాఫ్‌ నర్సు పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.21వేల జీతం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి చూపే అభ్యర్థులు ఈ నెల 13వ తేదీ నుంచి 24వ తేదీ వరకు సెల్ఫ్‌ అటెస్టేషన్‌తో కూడిన అన్ని సర్టిఫికెట్ల జిరాక్స్‌ కాపీలను జతపరిచి దరఖాస్తు ఫారాలను జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయనికి పోస్టులో గడువు ముగింపు తేదీ లోగా పంపించాలి. పోస్టు ద్వారా గానీ వ్యక్తిగతంగగాని అందజేయాలని సూచించారు.