చిన్న గొడవ.. పెను దుమారంగా మారింది. అది కాస్త.. ఓ గర్భిణీకి అబార్షన్ కావడానికి కూడా దారితీసింది. ఓ గర్భిణిపై ఇద్దరు భార్య భర్తలు పిడిగుద్దులు కురిపించారు. దీంతో.. ఆమెకు రక్తస్రావం కావడంతోపాటు.. పిండం వచ్చి బయటపడింది. ఈ దారుణ సంఘటన ఖమ్మం జిల్లా టేకులపల్లిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. మండలంలోని మద్దిరాలతండా గ్రామస్తుడు బాదావత్‌ లక్ష్మణ్‌ భార్య పద్మ ఆరు నెలల గర్భిణి. వీరి ఇద్దరు పిల్లలు మేఘనశ్రీ, అభిశ్రీ... స్థానిక ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు. ఈ పాఠశాల ఆవరణలోనే అంగన్‌వాడీ కేంద్రం ఉంది. ఈ నెల 3వ తేదీన  మేఘనశ్రీ, మధ్యాహ్న భోజనం ప్లేటుతో అంగన్‌వాడీ కేంద్రంలో భోజనం చేస్తుండగా.. ఆయా ఆ చిన్నారిని తిట్టి బయటకు పంపించింది.

ఈ విషయాన్ని చిన్నారి ఇంటికి వచ్చి తల్లి పద్మకు చెప్పింది. తన కూతురిని ఎందుకు తిట్టిందో తెలుసుకునేందుకు పద్మ అంగన్ వాడీ కేంద్రానికి వెళ్లింది. ఈ క్రమంలో ఆయాకి, పద్మకి గొడవ మొదలైంది. అదే సమయంలో ఆయా భర్త అక్కడికి వచ్చి.. పద్మపై దాడి చేశాడు. ఆయా, ఆమె భర్త ఇద్దరూ కలిసి పద్మను జుట్టు పట్టుకుని విపరీతంగా కొట్టారు. కడుపుపై పిడి గుద్దులు గుద్దారు. 

ఆరు నెలల గర్భవతయిన పద్మకు తీవ్రంగా రక్త స్రావమైంది. ఆ వెంటనే గర్భస్రావమైంది. పిండం పూర్తిగా బయటపడింది. ఆమె స్పృహ కోల్పోయింది. అంగన్‌వాడీ టీచర్, గ్రామస్తులు చూస్తుండగానే ఇదంతా జరిగింది. పద్మను ఆమె భర్త లక్ష్మణ్, కుటుంబీకులు కలిసి 108 అంబులెన్స్‌లో కొత్తగూడెం ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెను కొత్తగూడెం రూరల్‌ సీడీపీఓ కనకదుర్గ పరామర్శించారు. కుటుంబీకుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.