ఆంధ్రాలో కేసిఆర్ కు పాలాభిషేకం

ఆంధ్రాలో కేసిఆర్ కు పాలాభిషేకం

తెలంగాణలో ఏ ముఖ్యమంత్రికీ ఇన్నిసార్లు పాలాభిషేకాలు జరిగి ఉండకపోవచ్చు. ఇప్పటి వరకు నాలుగేళ్ల కాలంలో వందలసంఖ్యలో కేసిఆర్ కు పాలాభిషేకాలు జరిగాయి. వేల లీటర్ల పాలను అభిమానం రూపంలో కేసిఆర్ చిత్ర పటాలపై కురిపించారు. అయితే అనేక సందర్భాల్లో కేసిఆర్ కు పాలాభిషేకం చేసినా... ఆయన ఇచ్చిన హామీలు మాత్రం పూర్తి స్థాయిలో అమలు కాలేదన్న విమర్శలు కూడా బలంగానే ఉన్నాయి. ఏది ఏమైనా.. తన మాటలు.. ప్రకటనలు, హామీలతో వందలు, వేల సంఖ్యలో అభిమానులను ఆకట్టుకోవడంలో కేసిఆర్ దిట్టగా పేరు తెచ్చుకున్నారు. తెలంగాణలో నిత్యం ఏదో ఒక చోట కేసిఆర్ కు పాలాభిషేకం జరుగుతూనే ఉంటుంది.

ఇప్పుడు ఆంధ్రా వంతు వచ్చింది. సీమాంధ్రకు వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ తెచ్చుకున్న కేసిఆర్ కు సీమాంధ్ర ప్రజలే ఇప్పుడు పాలాభిషేకం చేయడానికి రెడీ అవుతున్నారు. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది ముమ్మాటికీ నిజం. ఇంతకూ ఆంధ్రాలో ఎక్కడ కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారనేగా మీ డౌట్ అయితే చదవండి.

జనవరి 9వ తేదీన ఎపి రాజధాని నగరం విజయవాడలో తెలంగాణ సిఎం కేసిఆర్ చిత్ర పటానికి యాదవులు పాలాభిషేకం చేయనున్నారు. యాదవ యువ భేరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. తెలంగాణ యాదవులకు ఒక రాజ్యసభ సీటు, ఒక ఎమ్మెల్సీ పోస్టు ఇస్తానని కేసిఆర్ హామీ ఇచ్చినందున ఈ కార్యక్రమం చేపట్టినట్లు యువ భేరి నేతలు ప్రకటించారు. లక్కనబోయిన వేణు, కొలుసు సతీష్ యాదవ్ ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది.

మొత్తానికి కేసిఆర్ కు తెలంగాణలోనే కాకుండా సీమాంధ్రలో కూడా పాలాభిషేకాల ట్రెండ్ మొదలు కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.  

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Telangana

Next page