హైదరబాద్: తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ కు ఆంధ్రాలోనూ అభిమానులు ఉన్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కేసీఆర్ గెలవాలంటూ ఇటీవలే ఓ ఆంధ్రా అభిమాని అమ్మవారికి 101 కొబ్బరికాయలు కొట్టి మెుక్కు చెల్లించుకున్నాడు. అయితే కేసీఆర్ సీఎం కావాలంటూ ఓ అభిమాని నాలుక కోసుకుని ఆ నాలుకను హుండీలో వేసి తన పిచ్చి అభిమానాన్ని చాటుకున్నాడు.  

తాజాగా బుధవారం తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో మరో ఆంధ్రా అభిమాని 101 కొబ్బరికాయలు కొట్టి కేసీఆర్ గెలవాలంటూ సత్యనారాయణ స్వామిని వేడుకున్నాడు. అంతేకాదు ఓ యువకుడు రెండు రాష్ట్రాల్లో సైకిల్ పై యాత్ర చేశాడు. సైకిల్ యాత్ర చేస్తూ కేసీఆర్ ప్రశంసలు సైతం అందుకున్నాడు. 

అంతేకాదు కేసీఆర్ అమరావతి రాజధాని నిర్మాణం శంఖుస్థాపన కార్యక్రమానికి వెళ్లినప్పుడు కూడా విజయవాడలో భారీ ఫ్లెక్సీలు వెలిశాయి కూడా. కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నప్పుడు కూడా కేసీఆర్ కు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు వెలిశాయి.

ఇవన్నీ ఒక ఎత్తైతే  కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ మహేష్ అనే ఆంధ్రా యువకుడు ఏకంగా నాలుక కోసుకున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరంకు చెందిన మహేష్ కు కేసీఆర్ అంటే విపరీతమైన అభిమానం. తెలంగాణలో కేసీఆర్ ప్రవేశపెట్టే అభివృద్ధి పథకాలపై ఫ్రెండ్స్ తో చర్చించేవాడట. 

బంజారాహిల్స్ శ్రీనగర్ కాలనీలో ఉంటున్న మహేష్ ముందస్తు ఎన్నికల్లో మళ్లీ కేసీఆర్ గెలవాలంటూ బంజారాహిల్స్‌లోని ఓ ఆలయంలో నాలుకను కోసుకున్నాడు. కోసిన నాలుకను దేవాలయం హుండీలో కానుకగా వేసి మొక్కు తీర్చుకున్నాడు. 

నాలుక కోసుకోవడంతో తీవ్ర రక్తస్రావమైన మహేష్ సొమ్మసిల్లి పడిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు తన్వీర్  ఆస్పత్రికి తరలించారు. మహేష్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

"