తెలుగు ప్రజల మద్యే  కాకుండా తెలుగు ముఖ్యమంత్రుల మద్య కేడా ఎన్డీఏ పార్టీ చిచ్చు పెట్టాలని చూసిందని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు.  అందుకోసమే అవిశ్వాస తీర్మాన ప్రసంగంలో తనకు మెచ్యూరిటీ లేదని, కేసీఆర్ మెచ్యూరిటిగా వ్యవహరిస్తున్నారని చెప్పి విబేధాలు సృష్టించడానికి ప్రయత్నించారని చంద్రబాబు  గుర్తుచేశారు. అన్నదమ్ముల్లా ఉండాల్సిన రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయంగా లబ్ది పొందాలని ప్రధాని మోదీ ప్రయత్నించారని చంద్రబాబు ఆరోపించారు.   

ఇవాళ టిటిడిపి కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నచంద్రబాబు కార్యకర్తలను, నాయకులను ఉద్యేశించి ప్రసంగించారు.  విభజన వల్ల ఇటు తెలంగాణ, అటు ఆంధ్రా ప్రాంతానికి అన్యాయం జరిగిందని చంద్రబాబు తెలిపారు. తాను విభజన సమయంలో కూడా తెలంగాణ ను వ్యతిరేకించలేదని అన్నారు. కానీ ఆంధ్రాకు న్యాయం కావాలని కోరినట్లు గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలకు తెలంగాణ కావాలి....ఆంధ్ర కు న్యాయం కావాలి...ఇలా సమన్యాయం పాటిస్తూ విభజించాలని అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. 

తెలంగాణలో తెలుగు దేశం పార్టీ బిజెపితో పొత్తును ఉపసంహరించుకున్నట్లు ప్రకటించుకుందని తెలిపిన చంద్రబాబు...ఈ విషయంపై కనీసం తమతో సప్రదించలేదని విమర్శించారు. ఇదేనా మిత్ర ధర్మం అని ఆయన బిజెపి ని ప్రశ్నించారు.

తెలంగాణ, హైదరాబాద్ ల అభివృద్ది టిడిపి ప్రభుత్వ హయాంలో జరిగినట్లు చంద్రబాబు గుర్తు చేశారు. మైక్రో సాప్ట్ సంస్థను హైదరాబాద్ కు తీసుకువచ్చి ఐటీని అభివృద్ది చేసినట్లు ఆయన తెలిపారు. న్యూయార్క్ వంటి నగరాల్లో కాలి నడకన ఫైళ్లు సంకలో పెట్టుకుని ఐటీ అభివృద్ది కోసం తిరిగామన్నారు.

ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ కే కాదు తెలంగాణకు కూడా అన్యాయం చేసిందని చంద్రబాబు ఆరోపించారు. విభజన చట్టంలో పొందుపర్చిన ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదానే కాదు తెలంగాణకు బయ్యారం స్టీల్ ప్లాంటు,ట్రైబల్ యూనివర్సిటీ హామీలను కూడా నెరవేర్చలేదని గుర్తు చేశారు. దేశంలోనే ఎక్కువ ట్యాక్సులు కట్టే నగరం హైదరాబాద్ కు కేంద్ర ఏమిచ్చిందని చంద్రబాబు ప్రశ్నించారు.

తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉండటానికి కారణం తెలుగుదేశం ప్రభుత్వ ముందుచూపే అని చంద్రబాబు ప్రశంసించారు. తెలుగు జాతి మద్య విబేధాలు సృష్టించవద్దని తాను కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు గుర్తు చేశారు.  భారత దేశంలో ఒకటి రెండు స్థానాల్లో ఆంధ్రా తెలంగాణ ఉండాలని కోరుకుంటానని అన్నారు.  తెలంగాణ గడ్డపై తెలుగు దేశం పార్టీ ఉండాలని ఆకాంక్షిస్తున్నానని...అందరికీ సీట్లు రాకపోయినా సంయమనంతో ఉండాలని తెలంగాణ నాయకులకు చంద్రబాబు సూచించారు. చివరగా జై తెలంగాణ నినాదంతో చంద్రబాబు తన ప్రసంగాన్ని ముగించారు.