Asianet News Telugu

తన అనుచరుడే.. కానీ పార్టీ మారాడు, విషయం తెలియక ‘‘ గుట్టు ’’విప్పేసి : అడ్డంగా బుక్కైన కౌశిక్

కాంగ్రెస్ మాజీ నాయకుడు కౌశిక్ రెడ్డి ఆడియో లీకేజ్ వ్యవహారం చివరికి ఆయన రాజీనామా, బహిష్కరణకు దారి తీసింది. తన సెకండ్ కేడర్ ఎటువైపు వెళ్తుందో కూడా తెలుసుకోకుండా కౌశిక్ రెడ్డి అతనితో మాట్లాడడం వల్లే వ్యవహారం ఇంతదూరం వచ్చిందని స్పష్టం అవుతోంది.

analysis of Padi Kaushik Reddy issue in telangana congress ksp
Author
Hyderabad, First Published Jul 12, 2021, 9:14 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన కాంగ్రెస్ బహిష్కృత నేత కౌశిక్ రెడ్డి ఎరక్కపోయి ఇరుక్కున్నట్టుగా తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం కమలాపూర్ మండలం మాదన్నపేటకు చెందిన విజయేందర్ రెడ్డితో కౌశిక్ మాట్లాడిన ఆడియో లీక్ అయిన విషయం తెలిసిందే. కౌశిక్ రెడ్డికి ఒకప్పుడు అనుచరునిగా ఉన్న విజయేందర్ రెడ్డి ఇటీవలే ఈటలకు మద్దతుగా బీజేపీలో చేరారు. ఈ విషయం తెలియని కౌశిక్ ఆయనకు ఫోన్ చేసి తలనొప్పి కొని తెచ్చుకున్నారని హుజురాబాద్ వాసులు చర్చించుకుంటున్నారు. తన సెకండ్ కేడర్ ఎటువైపు వెళ్తుందో కూడా తెలుసుకోకుండా కౌశిక్ రెడ్డి అతనితో మాట్లాడడం వల్లే వ్యవహారం ఇంతదూరం వచ్చిందని స్పష్టం అవుతోంది.

పాడి కౌశిక్ రెడ్డి గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ టిఆర్ఎస్ నాయకులతో సన్నిహితంగా ఉంటున్నట్టు ఫిర్యాదులు వచ్చాయని టీపీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ కోదండరెడ్డి చెప్పారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ పీసీసీ కౌశిక్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది.

కానీ సాయంత్రానికి కౌశిక్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. త‌న‌కు టీఆర్ఎస్ టికెట్ వ‌చ్చింద‌ని, కొంత‌మంది నేత‌ల‌కు ఫోన్ లో కౌశిక్ రెడ్డి సాగించిన బేర‌సారాలు బ‌య‌ట‌కు పొక్క‌టంతో కాంగ్రెస్ క్ర‌మ‌శిక్ష‌ణ సంఘం సీరియ‌స్ అయ్యింది. 24గంట‌ల్లో సంజాయిషీ ఇవ్వాల‌ని... స‌రైన స‌మాధానం రాక‌పోతే పార్టీ నుండి బ‌హిష్క‌రిస్తామ‌ని హెచ్చ‌రించింది. 

ఇదే సమయంలో పార్టీలో క్రమశిక్షణను ఉల్లంఘించే నేతలకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రమైన హెచ్చరికలు చేశారు. ఇంటి దొంగలను విడిచి పెట్టేది లేదని ఆయన హెచ్చరించారు. ఇంటి దొంగలు ఎవరైనా ఉంటే పరార్ కావాలని, లేదంటే బుద్ధి తెచ్చుకుని మసలుకోవాలని ఆయన అన్నారు. నెలాఖరు వరకు ఇంటి దొంగలకు సమయం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. పార్టీలో కష్టపడోడుంటే వదులుకునేది లేదని, దగ్గర పెట్టుకుని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని ఆయన చెప్పారు. 

Also Read:రేవంత్‌పై వ్యాఖ్యలు: భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు.. హుజురాబాద్‌లో కౌశిక్ రెడ్డి చిత్రపటం దగ్ధం

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా అనంతరం కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు . ఆయన పీసీసీ అధ్యక్షుడిలాగా వ్యవహరించడం లేదని ఎద్దేవా చేశారు. ఈటలకు రేవంత్ రెడ్డి అమ్ముడుపోయారని ఆరోపించారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులకు పీసీసీ పదవిని ఎందుకు ఇవ్వలేదని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ జెండా మోసినోళ్లమంతా పిచ్చోళ్లమా అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో పొన్నం, రేవంత్ రెడ్డిలకు కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. పొన్నంకి డిపాజిట్ వస్తుందేమో చూస్తానంటూ వ్యాఖ్యానించారు. 

రేవంత్ రెడ్డి వల్ల ఆరు నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని కౌశిక్ రెడ్డి జోస్యం చెప్పారు. పొన్నం, రేవంత్ రెడ్డిలు ఈటలకు కోవర్ట్‌లని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఎలా అయ్యారో అందరికీ తెలుసునన్నారు. లుంగి కట్టుకుని ఢిల్లీ నుంచి వచ్చే మాణిక్ ఠాగూర్‌కి కొంచెం కూడా కామన్ సెన్స్ వుండదని, పెద్ద లీడర్‌ని అని చెప్పుకుంటారంటూ కౌశిక్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాణిక్ ఠాగూర్ పెద్ద యూజ్ లెస్ ఫాలో అని ధ్వజమెత్తారు. మాణిక్ ఠాగూర్‌కి రూ.50 కోట్లు ఇచ్చి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు.

Follow Us:
Download App:
  • android
  • ios