Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ ప్రజల పల్స్ నాకు తెలుసు.. అక్కడ రాబోయేది బీజేపీ ప్రభుత్వమే: అమిత్ షా

తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు.

Amit shah says Telangana will see a BJP state govt soon
Author
First Published Nov 26, 2022, 10:39 AM IST

తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు. టైమ్స్ నౌ సమ్మిట్ 202లో పాల్గొన్న అమిత్ షా ఈ కామెంట్స్ చేశారు. తాను తప్పకుండా తెలంగాణకు వెళ్తానని చెప్పారు. తెలంగాణ ప్రజల పల్స్ తనకు తెలుసునని అమిత్ షా అన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశంలో మరోసారి ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే తెలంగాణపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఇక్కడి పరిణామాలను బీజేపీ అధిష్టానం ఎప్పటికప్పుడూ ఆరా తీస్తుంది. తెలంగాణలో బీజేపీ విజయం కోసం అనుసరించాల్సిన వ్యుహాలపై.. రాష్ట్ర నాయకులకు దిశానిర్దేశం చేస్తుంది. ఈ క్రమంలోనే బీజేపీ నాయకులు ఇతర పార్టీల్లోని బలమైన నాయకులను పార్టీలో చేర్చుకోవడం.. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. 

మరోవైపు గతకొంతకాలంగా తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్‌ల మధ్య రాజకీయ పోరు తీవ్ర స్థాయికి చేరుకుంది. ఓ వైపు టీఆర్ఎస్ నాయకులపై ఐటీ, ఈడీ దాడులు జరుగుతుండంతో.. కేంద్రంలోని అధికార బీజేపీపై ఆ పార్టీ శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మరోవైపు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసుకు సంబంధించి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు సిట్ నోటీసులపై ఆ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాల వేళ తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని అమిత్ షా కామెంట్స్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios