హైదరాబాద్ నగరంలో సైక్లింగ్ చేస్తూ ఓ విదేశీయుడు కన్నుమూశాడు. కొద్ది రోజుల క్రితమే నగరానికి వచ్చిన ఆ విదేశీయుడు అనూహ్యంగా మృతి చెందడం అందరినీ విస్మయానికి గురిచేసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... అమెరికాకు చెందిన జాన్‌ రాబర్ట్‌ పాల్‌ (39) కొన్ని రోజుల క్రితం నగరానికి వచ్చాడు. అతని భార్య గచ్చిబౌలిలోని ఐటీ కంపెనీలో పని చేస్తున్నందున కొంతకాలంగా ఇక్కడే ఉంటున్నాడు. రోజూ స్నేహితుడితో కలిసి గచ్చిబౌలి నుంచి గండిపేటకు సైక్లింగ్‌ చేసేవాడు.

ఆదివారం స్నేహితుడు రాకపోవడంతో సాయంత్రం పాల్‌ ఒక్కడే సైక్లింగ్‌కు వెళ్లాడు. భర్త ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో భార్య అతడికి ఫోన్‌ చేసింది. సమాధానం రాకపోవడంతో అతని స్నేహితుడిని కాంటాక్ట్‌ చేసి, సైక్లింగ్‌ చేసే రూట్‌లో వెతుక్కుంటూ వెళ్లారు. 

గండిపేట వద్ద తలకు తీవ్రగాయంతో మృతి చెందడంతో షాక్‌కు గురయ్యారు. సమాచారం అందుకున్న నార్సింగ్‌ పోలీసులు వచ్చి పరిశీలించారు. సైక్లింగ్‌ చేస్తూ గుట్టపై నుంచి జారి పడటంతోనే తలకు తీవ్ర గాయమై మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.