ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో కరోనా వ్యాక్సిన్ తీసుకొన్న విఠల్‌రావు అనే వ్యక్తి  మరణించాడు. వ్యాక్సిన్ తీసుకొన్న తర్వాత అనారోగ్యానికి గురై ఆయన మరణించినట్టుగా కుటుంబసభ్యులు చెబుతున్నారు. విఠల్ రావు మరణానికి కోవిడ్ వ్యాక్సిన్ కారణమా లేదా అనేది ఇప్పుడే చెప్పలేమని వైద్యులు ప్రకటించారు. . ఈ విషయమై ఇంకా రిపోర్టులు రావాల్సి ఉందని వైద్యాధికారులు తెలిపారు.

నిర్మల్ జిల్లాలో 108 అంబులెన్స్ డ్రైవర్ గా విఠల్ రావు పనిచేస్తున్నాడు.  మంగళవారం నాడు కుంటాల పీహెచ్‌సీ ఆయన కరోనా వ్యాక్సిన్ తీసుకొన్నాడు. 

వ్యాక్సిన్ తీసుకొన్న తర్వాత విఠల్ రావు సాయంత్రం ఇంటికి చేరుకొన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత అస్వస్థతకు గురయ్యారు.  వెంటనే అతడిని నిర్మల్ ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  నిర్మల్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ విఠల్ రావు మరణించాడు.  

విఠల్ రావు  గుండెపోటుతో మరణించినట్టుగా  కూడా ప్రచారం సాగుతోంది.  విఠల్ రావు మరణానికి టీకా కారణమా లేదా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. ఈ విషయాన్ని నిర్ధారించేందకు నిపుణుల బృందం  నిర్మల్ జిల్లాకు రానుంది.

విఠల్ రావు మృతదేహానికి నిర్మల్ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. విఠల్ రావు మరణానికి వ్యాక్సిన్ కారణమా.. ఇతరత్రా అంశాలు కారణమా అనే విషయమై తేలనుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు తెలిపారు. 

ఈ ఘటనపై మృతుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.