తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు అమరరాజా గ్రూప్ వచ్చింది. రాష్ట్రంలో రూ. 9,500 కోట్ల పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నట్లు అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్ శుక్రవారం తెలిపింది.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అమరరాజా గ్రూప్ ముందుకు వచ్చింది. విద్యుత్ వాహనాలకు అవసరమయ్యే లిథియం-అయాన్ బ్యాటరీ తయారీకి పరిశోధన, తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయడంపై వచ్చే పదేళ్లలో తెలంగాణలో రూ. 9,500 కోట్ల పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నట్లు అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్ శుక్రవారం తెలిపింది. మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టుగా పేర్కొంది. ఈ మేరకు అమరరాజా సంస్థ, తెలంగాణ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, అమర రాజా బ్యాటరీస్ సీఎండీ గల్లా జయదేవ్.. తదితరులు పాల్గొన్నారు.
ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనున్న అమరరాజా గ్రూప్ సంస్థకు శుభాకాంక్షలు చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు పెట్టుబడులకు ముందుకొచ్చిన జయదేవ్‌కు ధన్యవాదాలు తెలిపారు. సుమారు రూ. 9,500 కోట్ల పెట్టుబడులు రావడం గొప్ప విషయమన్నారు. అమరరాజా కంపెనీకి అన్ని విధాలుగా అండగా ఉంటామని స్పష్టం చేశారు. 37 ఏండ్లుగా అమరరాజా సేవలందిస్తోందని గుర్తుచేశారు. తెలంగాణ మానవ వనరులు సమృద్దిగా ఉన్నాయని.. పారిశ్రామిక వేత్తలకు అన్ని వసతులు కల్పిస్తున్నామని చెప్పారు.
గల్లా జయదేవ్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తర్వాత తమ పెట్టుబుడులు ఏపీకే పరిమితమయ్యాయని చెప్పారు. పలు కారణాలతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టి కార్యకలాపాలు మొదలుపెట్టలేకపోయామని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి డిమాండ్ ఏర్పడిందని.. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నామని చెప్పారు. పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమైన ప్రదేశమని అని పేర్కొన్నారు. వచ్చే 10 ఏండ్లలో తెలంగాణలో రూ. 9,500 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నామని స్పష్టం చేశారు.
