హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ సిపిఐతో పొత్తును ఖరారు చేసుకుంది. సిపిఐ నేతలతో చర్చల తర్వాత పొత్తు ఖరారైన విషయాన్ని టీడీపీ నేతలు మీడియాతో చెప్పారు.  సీపీఐ తరపున చాడా వెంకటరెడ్డి చర్చల్లో పాల్గొన్నారు. 

టీడీపీతో కలిసి పనిచేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సమావేశానంతరం ప్రకటించారు. గెలిచే స్థానాలే అడుగుతామని స్పష్టం చేశారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని ఇరు పార్టీలు నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
 
మహా కూటమి కావాలనుకుంటున్నామని చాడా చెప్పారు. ఇంకా తమతో కలిసి వచ్చే పార్టీలతో కూడా సంప్రదింపులు జరుపుతామని అన్నారు. తెలంగాణ టీడీపీ తరపున ఈ సమావేశంలో పాల్గొన్న టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ రేపు, ఎల్లుండి మిగతా పార్టీలతో మాట్లాడనున్నట్లు తెలిపారు. 

రానున్న రోజుల్లో మహాకూటమి జెండా ఎగురవేస్తామని ఆయన చెప్పారు. కేసీఆర్‌కు రాజకీయ, నైతిక విలువలు లేవని ఎల్.రమణ విమర్శించారు. కాంగ్రెస్‌తోనూ పొత్తుపై సంప్రదింపులు జరుపుతామని రమణ తెలిపారు.