తెలంగాణ  కాంగ్రెస్ యాత్రల బాట పట్టింది. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ‘‘హోత్ సే హాత్ జోడో అభియాన్’’లో భాగంగా పాదయాత్రను  కొనసాగిస్తున్నారు. ఈ యాత్ర కాంగ్రెస్ శ్రేణుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. తాజాగా టీ కాంగ్రెస్ నుంచి మరో యాత్ర ఖరారు అయింది. 

తెలంగాణ కాంగ్రెస్ యాత్రల బాట పట్టింది. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ‘‘హోత్ సే హాత్ జోడో అభియాన్’’లో భాగంగా పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఈ యాత్ర కాంగ్రెస్ శ్రేణుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. మరి కొందరు సీనియర్ నేతలు కూడా తాము కూడా యాత్రలు చేస్తామని ప్రకటించినప్పటికీ.. అవి కార్యరూపం దాల్చడం లేదు. అయితే తాజాగా టీ కాంగ్రెస్ నుంచి మరో యాత్ర ఖరారు అయింది. ‘‘కాంగ్రెస్ తెలంగాణ పోరు యాత్ర’’ పేరుతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి హైదరాబాద్ వరకు యాత్ర చేపట్టాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. మార్చి 3వ తేదీన ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి వివరాలను ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి సోమవారం వెల్లడించారు. 

ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసరలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం యాత్ర ప్రారంభం కానుందని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. తొలిరోజు యాత్ర భైంసా వరకు కొనసాగుతుందని తెలిపారు. మార్చి 7వ తేదీన హోలీ సందర్భంగా యాత్రకు విరామం ప్రకటించనున్నట్టుగా తెలిపారు. మార్చి 9వ తేదీన యాత్ర బోథ్ వరకు చేరుకుంటుందని.. దీంతో తొలి విడత యాత్ర ముగుస్తుందని చెప్పారు. ఆ తర్వాత రెండో విడత షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నట్టుగా చెప్పారు. ఈ విధంగా హైదరాబాద్ వరకు యాత్రను కొనసాగించి.. గాంధీభవన్‌లో ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించేలా షెడ్యూల్ రూపొందిస్తామని తెలిపారు. 

కాంగ్రెస్ అధిష్టానం అనుమతితోనే ఈ యాత్రకు సిద్దమయ్యామని.. కాంగ్రెస్ తెలంగాణ పోరు యాత్ర పేరుతో యాత్ర చేపట్టిన అది హోత్ సే హాత్ జోడో అభియాన్‌లో భాగమేనని మహేశ్వర్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నాయకులందరూ ఈ యాత్రలో పాల్గొంటారని చెప్పారు. అయితే మహేశ్వర్ రెడ్డి పాదయాత్రపై అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో.. పార్టీలోని నాయకుల నుంచి ఏ విధమైన మద్దతు లభిస్తుందో వేచిచూడాల్సి ఉంది.

ఇక, రేవంత్ రెడ్డి మేడారం నుంచి యాత్ర కొనసాగిస్తారని.. సీనియర్ నేతలు వేర్వరు ప్రాంతాల నుంచి, వేర్వేరు సమయాల్లో యాత్రలు కొనసాగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం అనుమతించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రే కూడా స్పష్టం చేశారు. దీంతో రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 6వ తేదీ మేడారం నుంచి హోత్ సే హాత్ జోడో యాత్రను ప్రారంభించి కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణ పోరు యాత్ర పేరుతో మహేశ్వర్ రెడ్డి భారీ యాత్రకు సిద్దం కావడం చర్చనీయాంశంగా మారింది. దీంతో కాంగ్రెస్‌లో మళ్లీ ముసలం రాజేసుకుందని కొందరు చెబుతుంటే.. మరికొందరు మాత్రం ఇది రేవంత్‌కు పోటీగా చేపట్టిన యాత్ర కాదని, పార్టీ ప్రయోజనాల కోసమే నిర్వహిస్తున్న కార్యక్రమం అని అంటున్నారు.