టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. రైతుల పొలాలను బాలకిషన్‌ ధ్వంసం చేయడంతో పాటు దౌర్జన్యంగా వ్యవహరించారని ఓ యువకుడు ఆరోపించాడు. రైతుల అనుమతి లేకుండా అక్రమంగా వారి పొలాల మీదుగా తన ఫాంహౌస్‌లోకి కాల్వ తవ్వించుకున్నారని అతను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టాడు.

కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ-10లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరి (అన్నపూర్ణ) ప్రాజెక్టు నుంచి వస్తున్న డీ-7 కాల్వ నుంచి గుండారం, రేపాక గ్రామాలకు సాగు నీరందించేందుకు తవ్విన ఉప కాల్వ ఈ వివాదానికి కారణమైంది.

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుండారం గ్రామంలో బాలకిషన్ భూమిని కొనుగోలు చేసి ఫాంహౌస్‌ నిర్మించుకున్నారు. అయితే స్థానిక రైతుల అభిప్రాయాలు సేకరించకుండా పంట పొలాలను ధ్వంసం చేసి ఆయన నేరుగా ఫాంహౌస్‌లోకి కాల్వను తీసుకెళ్లారని బెజ్జంకి మండలం బేగంపేట గ్రామానికి చెందిన పోతిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అనే యువకుడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టాడు.

ప్రస్తుతం అది సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. గుండారం గ్రామ శివారు నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామంలోని యెన్నంకుంట, బెజ్జంకి మండలం కళ్లేపల్లి గ్రామంలోని ఎక్క చెరువును నింపడానికి కాల్వ నిర్మాణం చేపట్టడానికి రైతుల అభిప్రాయాలను సేకరించి భూ సేకరణ పూర్తి చేశామని అధికారులు చెబుతున్నారు.

ఈ 2-ఎల్‌ ఉప కాల్వ ద్వారా 201 ఎకరాలకు సాగునీరందుతుందని అధికారులు పేర్కొన్నారు. అయితే గుండారం గ్రామ శివారులోని రసమయి హౌస్ వున్న భూమి నుంచి కాల్వ వెళ్తోందని తెలిపారు.

రైతుల శ్రేయస్సు కోసం ఎమ్మెల్యే బాలకిషన్ తన భూమి నుంచి 0.35 ఎకరాలను కాల్వ నిర్మాణం కోసం అందజేశారని వెల్లడించారు. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన రాజశేఖర్‌రెడ్డికి గతంలోనే ఎమ్మెల్యే రసమయితో వాగ్వాదం జరిగిందని చెబుతున్నారు.

పాత గొడవల నేపథ్యంలో ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారని స్థానిక రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ సమ్మతితోనే కాల్వ కోసం అధికారులు భూ సేకరణ చేశారని, రైతులందరి ప్రయోజనం కోసం తాము భూములు త్యాగం చేశామని అన్నదాతలు వెల్లడించారు.