గోవిందరావుపేట : ములుగు నియోజకవర్గంలో వరుసగా మూడో రోజు తె రాష్ట్ర గిరిజన,పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ పర్యటన విస్తృతంగా సాగింది. గోవిందరావు పేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. గత కొద్ది నెలలుగా ములుగు నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంపై మంత్రి చందూలాల్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ మేరకు అధికారులను, ప్రజలను సమన్వయం చేస్తూ ఆయా గ్రామాలలో డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేస్తున్నారు.

తాజాగా శుక్రవారం గోవిందరావుపేట మండలం, చల్వాయి గ్రామంలో రూ.201.6 లక్షలతో నూతనంగా నిర్మించనున్న 40 డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి శాస్త్రోక్తంగా భూమి పూజ చేశారు. ఆ తర్వాత గోవిందరావుపేట మండలంలోని ఎన్టీఆర్ కాలనీలోనూతనంగా రూ. 1 కోటి 71 లక్షలతో నిర్మించనున్న 34 బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి కూడా మంత్రి చందూలాల్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాలలో మంత్రి చందూలాల్ గ్రామ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.  స్వరాష్ట్రంలో ప్రతి పేదవాడు  రెండు పడకల ఇంటిలో సకల సౌకర్యాలతో దర్జాగా కాలుమీద కాలేసుకుని బతకాలన్న సీఎం కేసీఆర్ మహోన్నత ఆశయం మేరకే తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం చేపట్టామని..వచ్చే ఏడాదిలోగా రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టించి ఇచ్చేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని మంత్రి చందూలాల్ అన్నారు.

ములుగు నియోజకవర్గంలో  అర్హులందరికి దశల వారిగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి చందూలాల్ పునరుద్ఘాంటించారు. ఈ కార్యక్రమంలో ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ డాక్టర్ అజ్మీరా ప్రహ్లాద్ , రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ పల్లా బుచ్చయ్య. ఎంపీపీ, ఎంపిటిసి, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.