కేసీఆర్ ప్రభుత్వంపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం అఖిలపక్ష సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ... కరోనా నేపథ్యంలో గత నెల 22న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బియ్యం, నగదు సాయం పేదలకు ఇప్పటికీ అందలేదని ఆరోపించారు.

వలస కూలీల విషయంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని మండిపడ్డారు. కరోనా కారణంగా రెండో ప్రపంచ యుద్ధం కంటే ఎక్కువ మంది చనిపోయే పరిస్ధితి నెలకొందని నిపుణులు చెబుతున్నారని ఉత్తమ్ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం పంపిణీని త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 5 కిలోల బియ్యం ఏమయ్యాయని, వాటితో కలిపి రాష్ట్ర ప్రభుత్వం సాయం అందిస్తోందా లేదా వేరుగా ఇస్తున్నారా అనే విషయంపై స్పష్టం చేయాలని ఉత్తమ్ డిమాండ్  చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుడు వ్యవహారశైలి వల్లే రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ దెబ్బతింటోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం పాటు లాక్‌డౌన్‌ అమలు చేస్తే వేతనాలు ఇవ్వలేని స్థితికి రాష్ట్ర ఆర్ధిక స్థితి చేరిందా అని ఆయన నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వం బాండ్ల రూపంలో సమకూర్చిన రూ.1,500 కోట్లు ఏమయ్యాయని ఉత్తమ్ నిలదీశారు.

రాష్ట్రంలో వరి పంట కోతకు వచ్చే సమయం తెలిసినప్పటికీ గోనె సంచులు సమకూర్చుకోకపోవడం ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. అఖిలపక్ష సమావేశం ప్రతిపాదించిన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.