హుజూర్‌నగర్ ఉపఎన్నికకు సంబంధించి సోమవారంతో నామినేషన్లకు గడువు ముగియనుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి మంత్రి జగదీశ్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్‌లతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించారు. టీడీపీ అభ్యర్ధి చావా కిరణ్మయి ఎల్ రమణ, స్థానిక నేతలతో కలిసి నామినేషన్ వేశారు.

అటు కాంగ్రెస్ అభ్యర్ధి పద్మావతి భర్త ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతర నేతలతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్ధి డాక్టర్ కోటా రామారావు పార్టీ పెద్దలతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి కంచుకోట బద్ధలు కొట్టాలని టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. దీనిలో భాగంగా హుజూర్‌నగర్‌లో బలంగా ఉన్న సీపీఐ మద్ధతు కోరింది. ఆదివారం గులాబీ నేతలు కేకే, నామా, వినోద్‌లు చాడా వెంకటరెడ్డితో కలిసి చర్చలు జరిపారు.

కాగా సోమవారం కాంగ్రెస్ సైతం సీపీఐ మద్ధతు కోరింది. ఆ పార్టీ నేతలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి చాడా వెంకటరెడ్డిని కలిసి తమకు సహకరించాల్సిందిగా కోరారు. ఈ పరిణామాల నేపథ్యంలో హుజూర్‌నగర్‌లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.