Telangana: తెలంగాణ బీజేపీపై రాష్ట్ర ఐటీ, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పట్టణాభివృద్ధి శాఖ‌మంత్రి కేటీఆర్ మ‌రోసారి తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్రంలోని న‌లుగురు బీజేపీ ఎంపీల‌తో ఒరిగిందేమీ లేద‌ని అన్నారు.  

Telangana: తెలంగాణకు చెందిన నలుగురు బీజేపీ ఎంపీలు అసమర్థులని రాష్ట్ర ఐటీ, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పట్టణాభివృద్ధి శాఖ‌మంత్రి కేటీఆర్ అన్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, సికింద్రాబాద్ నుంచి నలుగురు బీజేపీ అభ్యర్థులను ప్రజలు ఎంపీలుగా ఎన్నుకున్నారు. అయితే, వారు తమ తమ నియోజకవర్గాలతో పాటు రాష్ట్ర అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. గురువారం పద్మనాయక ఫంక్షన్‌ హాలులో జరిగిన కార్యక్రమంలో బీజేపీని వీడిన మెండి శ్రీలత చంద్రశేఖర్‌, నక్క పద్మకృష్ణలను టీఆర్‌ఎస్‌ పార్టీలోకి ఆహ్వానిస్తూ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ నేత‌ల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు ఎన్నికల ముందు గిరిజన యూనివర్శిటీ మంజూరు చేస్తామనీ, సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా యూనిట్‌ను పునఃప్రారంభిస్తామని హామీ ఇచ్చారని, కానీ ఆ హామీని నిలబెట్టుకోలేదన్నారు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు డి అరవింద్ ఎన్నికైన ఐదు రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తూ బాండ్ పేపర్‌పై సంతకం చేశారు. అయితే ఎంపీ తన బాండ్ పేపర్ గురించి మర్చిపోయార‌ని పేర్కొన్నారు. 

దేశం కోసం, ధర్మం కోసం అనే మంత్రాన్ని నిత్యం జపించే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆ సెగ్మెంట్‌కు కనీసం పాఠశాల లేదా దేవాలయాన్ని మంజూరు చేయడంలో విఫలమయ్యారు. కాశీ అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ రూ.1000 కోట్లు వెచ్చించారు. అయితే దక్షిణ కాశీగా భావించే వేములవాడ ఆలయానికి కనీసం రూ.100 కోట్లు మంజూరు చేయడంలో సంజయ్ కుమార్ విఫలమయ్యారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్‌రెడ్డిని ఉద్దేశించి..కేంద్ర మంత్రిని నిస్సహాయ మంత్రిగా కేటీఆర్‌ అభివర్ణించారు.

హైదరాబాద్‌లో వరదల వల్ల నష్టపోయిన ఒక్కో కుటుంబానికి రూ.10,000 ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.660 కోట్లు వెచ్చించింది. అయితే వరద నీటిలో నిలబడి ఫొటోలకు స్టిల్స్ ఇచ్చిన కిషన్ రెడ్డి.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రాబట్టలేకపోయార‌ని విమ‌ర్శించారు. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ తన సొంత గుజరాత్ రాష్ట్రంలోని వరద బాధిత ప్రజలను ఆదుకోవడానికి రూ. 1,000 కోట్లు మంజూరు చేయ‌డాన్ని ప్ర‌స్తావిస్తూ.. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్న‌ద‌ని మండిప‌డ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు 157 మెడికల్ కాలేజీలు, 16 IISERలు, 4 NITలు, 8 IIMలను మంజూరు చేసింది. కానీ, తెలంగాణకు ఒక్క విద్యాసంస్థ కూడా మంజూరు చేయలేదని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు.

కాగా, కరీంనగర్ పట్టణంలో ఆధునిక సదుపాయాలతో నిర్మించిన బీసీ స్టడీ సర్కిల్ భవనాన్ని మంత్రులు గంగుల క‌మ‌లాక‌ర్‌, కేటీఆర్ ప్రారంభించారు. చొప్పదండి మున్సిపాలిటీలో కేటీఆర్ ప‌ర్య‌టించారు. ఈ క్ర‌మంలోనే పట్టణంలో తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ (TUFIDC) నిధులతో చేపట్టబోయే విద్యుదీకరణ, రోడ్డు వెడల్పు, సమీకృత మార్కెట్ నిర్మాణం మరియు మంచి నీటి సరఫరా పథకం పనులకు శంకుస్థాపన చేశారు.

Scroll to load tweet…