తెలంగాణ లో ఎన్నికలు జరిగి నూతన ప్రభుత్వం ఏర్పడి కూడా దాదాపు రెండు నెలలు కావస్తోంది. అంతేకాకుండా డిసెంబర్ లో కొత్తగా ఎన్నికయిన ఎమ్మెల్యేలు జనవరి 17న ప్రమాణస్వీకారం చేశారు. అయితే అప్పుడు మొత్తం 119 ఎమ్మెల్యేలకు గాను 114 మంది మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. వివిధ కారణాలతో ప్రోటెం స్పీకర్ వద్ద ప్రమాణస్వీకారం చేయలేకపోయిన ఎమ్మెల్యేలు ఆ తర్వాత స్పీకర్ వద్ద ప్రమాణ స్వీకారం  చేశారు.ఇలా తాజాగా చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యేగా ఎంఐఎం పార్టీ నుండి గెలుపొందిన అక్బరుద్దిన్ ఓవైసి ఇవాళ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. 

ఈరోజు శాసనసభ ప్రాంగణంలోని స్పీకర్ చాంబర్‌లో అక్బరుద్దిన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి సమక్షంలో ఆయన ఉర్ధూలో ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సభాపతి టి. పద్మారావు గౌడ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, శాసనసభ కార్యదర్శి వి. నరసింహా చార్యులు పాల్గొన్నారు.
 
గతంలో సొంత పార్టీ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ ప్రోటెం స్పీకర్ గా ఎమ్మెల్యేల చేత ప్రమాణస్వీకారం చేయించిన సమయంలో అక్బరుద్దిన్ సభకు హజరు కాలేకపోయారు. దీంతో ఇవాళ స్పీకర్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేయాల్సివచ్చింది. అక్బరుద్దిన్ ఇప్పటివరకు ఐదుసార్లు (1999, 2004, 2009, 2014, 2018) ఎమ్మెల్యేగా గెలుపొందారు.