తనను అంతమొందించేందుకు భారీ కుట్ర జరుగుతుందన్నారు ఎంఐఎం అగ్రనేత అక్బరుద్దీన్ ఒవైసీ. నిన్న రాత్రి యూకత్‌పురా బడాబజార్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. అహ్మదాబాద్, కర్నాటక, వారణాసి నుంచి కొంతమంది వ్యక్తులు తనను హత్య చేసేందుకు హైదరాబాద్‌కు వచ్చారని ఆరోపించారు.

గతంలో తనను చంపేందుకు ఇద్దరు రెక్కీ నిర్వహించారని అక్బర్ అన్నారు. తనను చంపుతామంటూ బెదిరింపు లేఖలు, ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయని ఒవైసీ అన్నారు. ప్రజల అండదండలే తనకు రక్ష అని.. తనను చంపితే వీధికో అక్బర్ పుడతాడంటూ ఉద్వేగంగా చెప్పారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యల నేపథ్యంలో సిటీ పోలీసులు అప్రమత్తమయ్యారు. కొత్తగా హైదరాబాద్‌కు వచ్చిన వారిపై నిఘా పెడుతున్నారు.