హైదరాబాద్: ఎంఐఎం కీలక నేత అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. డిసెంబరు 11 తర్వాత తెలంగాణలో చక్రం తిప్పుదాం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అక్బరుద్దీన్ ఈ ఎన్నికల్లో సీఎం ఎవరో డిసైడ్‌ చేస్తం, అంతా సవ్యంగా జరిగితే మనమే ముఖ్యమంత్రి అవుదాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ముఖ్యమంత్రి అయ్యేందుకు కర్ణాటక సీఎం కుమార స్వామి ఎన్నిక లాజిక్ ను తెరపైకి తీసుకువచ్చారు. 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో 38 స్థానాలు గెలిచిన జేడీఎస్‌ నేత కుమారస్వామి సీఎం అయినప్పుడు 8 స్థానాలు గెలుచుకుంటే తానెందుకు సీఎం కాలేనని మనసులోమాట బయటపెట్టారు. 

అంతేకాదు అందరికీ మనమే ఉద్యోగాలు ఇద్దాం అంటూ పదవిలోకి వచ్చిన తర్వాత మెుదటి పనిని కూడా చెప్పేశారు. కర్ణాటకలో ఎన్నికల ఫలితాల ట్రెండ్‌ మొదలవగానే హంగ్‌ ఏర్పడుతుందని గ్రహించిన కాంగ్రెస్ మెరుపు వేగంతో స్పందించిందని చెప్పారు.

 బీజేపీని అధికారంలో రానీయకుండా చూసేందుకు జేడీఎస్‌ నేత కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టిందని గుర్తు చేశారు. ప్రజాకూటమి సాధారణ మెజారిటీకి ఆరేడు సీట్ల దూరంలో ఆగిపోతే తెలంగాణలోనూ కర్ణాటకం తరహా సీన్ ఇక్కడ రిపీట్‌ అవుతుందని అక్బర్‌ ఆశిస్తున్నారు.

అక్బరుద్దీన్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా మిత్రపక్షానికి మింగుడుపడటం లేదు. ఎంఐఎం అధినేత  అసదుద్దీన్ ఓవైసీ టీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రావాలని, సీఎం కేసీఆర్‌ కావాలని రాష్ట్రమంతటా తిరిగి ప్రచా రం చేస్తుంటే ఆయన తమ్ముడు అక్బరుద్దీన్‌ భిన్నమైన ఎజెండాతో ముందుకెళ్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.  

అధికారంలో ఉన్న పార్టీతో మంచిగా ఉండి పని చేయించుకోవడానికి బదులు మనమే అధికారానికి వద్దామని సభల్లో పిలుపునివ్వడంతో అందరి దృష్టీ ఒక్క సారిగా ఎంఐఎం మీద పడింది. టీఆర్ఎస్ పార్టీతో మిత్రపక్షంగా ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం కలకలం రేపుతోంది.