ఈ ఎన్నికలే తన చివరి ఎన్నికలు అవుతాయేమోనని మజ్లీస్ నేత, చంద్రాయణగుట్ట ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఆయన ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఓటర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.  తన ఆరోగ్యం అస్సలు బాగోలేదని చెప్పారు. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఆయన వివరించారు. తన కిడ్నీలు పూర్తిగా పాడైపోయాయని.. కిడ్నీల దగ్గర కొన్ని తూటాల ముక్కలు ఉన్నాయని చెప్పారు.  కొన్ని రోజుల కిందటే పరిస్థితి చేయి దాటి పోయిందని డాక్టర్లు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.

డాక్టర్లు తనను డయాలసిస్ చేసుకోమన్నారు అని అక్బరుద్దీన్ చెప్పారు. తన ఆరోగ్యాన్ని చూసుకునే సమయం దొరకడం లేదని స్కూళ్లు, దారుసలాం బ్యాంకులు, హాస్పిటల్స్ చూసుకోవడానికే సరిపోతుంది అని ఆయన తెలిపారు. అనారోగ్యం కారణంగా ఇప్పటికే కొన్ని సభల్లో పాల్గొనలేదన్న విషయాన్ని గుర్తు చేశారు.  తానెప్పుడూ తన కోసం ఎన్నికల్లో పోటీ చేయలేదని చెప్పారు. తన కమ్యూనిటీకి సేవ చేయడానికి ఎవరు సిద్ధంగా ఉన్నా.. వాళ్ల కోసం తన స్థానం ఖాళీ చేస్తానని అక్బర్ స్పష్టం చేశారు.