చాంద్రాయణగుట్ట ఎమ్యెల్యే , ఎంఐఎం పార్టీ నేత అక్బరుద్దీన్ ఆరోగ్యం మెరుగుపడింది. కొద్ది రోజులు క్రితం ఆయన అనారోగ్యం బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను కుటుంబసభ్యులు  చికిత్స నిమిత్తం లండన్ తరలించారు.

 అనారోగ్యం కారణంగా లండన్ వెళ్లిన అక్బరుద్దీన్ ..45 రోజులపాటు అక్కడ  చికిత్స పొందారు. చికిత్స  అనంతరం తిరిగి ఆయన శుక్రవారం  హైదరాబాద్ చేరుకున్నారు. తెల్లవారుజామున అక్బరుద్దీన్ రాకతో అభిమానులు, కార్యకర్తల శంషాబాద్ విమానాశ్రయానికి తరలి వెళ్లారు. అక్కడి నుండి ఆయన నేరుగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న తన నివాసానికి చేరుకున్నారు. రాజకీయ ప్రముఖులు ఆయనను శనివారం పరామర్శించే అవకాశం ఉంది.

2011 ఏప్రిల్‌లో బార్కస్‌లో అక్బరుద్దీన్‌పై దాడి జరిగింది. అప్పట్లో తీవ్ర గాయాలైన ఆయన ప్రత్యేక ట్రీట్‌మెంట్ తర్వాత కోలుకున్నారు. ఈమధ్య మళ్లీ అనారోగ్య సమస్య రావడంతో మే 5న చికిత్స కోసం కుటుంబ సమేతంగా లండన్‌ వెళ్లారు. ఆయన కోలుకోవాలని ప్రార్థనలు చెయ్యాల్సిందిగా అన్నయ్య అసదుద్దీన్ ఒవైసీ... పార్టీ శ్రేణుల్ని కోరారు. మొత్తానికి ట్రీట్‌మెంట్ తర్వాత పూర్తిగా కోలుకున్న అక్బరుద్దీన్ తిరిగి రావడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.