తెలంగాణ ముఖ్యమంత్రి పీఠంపై మజ్లీస్ నేత అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు మజ్లీస్ మిత్రపక్షమని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రెండు రోజుల క్రితం ప్రకటించారు.

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి పీఠంపై మజ్లీస్ నేత అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు మజ్లీస్ మిత్రపక్షమని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రెండు రోజుల క్రితం ప్రకటించారు. ఈలోగానే అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

హైదరాబాదులోని మల్లేపల్లిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. డిసెంబరులో సీఎం అవుతానని కేసిఆర్ అంటున్నారుని అంటూ మజ్లిస్‌ నుంచి ముఖ్యమంత్రి కాలేమా అని అక్బరుద్దీన్‌ ప్రశ్నించారు. 


నవంబరులో ఎన్నికలు జరుగుతాయని, డిసెంబరులో తాను ముఖ్యమంత్రి అవుతానని కేసీఆర్‌ అంటున్నారని, ఎన్నికలు నవంబరులోనే జరుగుతాయని, కానీ డిసెంబరులో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసునని అక్బరుద్దీన్ అన్నారు. 


కర్ణాటకలో కుమారస్వామి ముఖ్యమంత్రి కాగలిగినప్పుడు మజ్లిస్‌ అభ్యర్ధి ఎందుకు ముఖ్యమంత్రి కాలేడని అడిగారు. డిసెంబరులో ఎవరి అవసరం ఎవరికి వస్తుందో చూద్దామని అన్నారు. డిసెంబర్‌లో మజ్లిస్‌ జెండా ఎగరేద్దామని, సత్తా చాటుదామని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.