హుస్నాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి ఒక ఏకే 47 చోరీ ఘటనలో ఉన్నతాధికారులు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఏకే 47, ఒక కార్బైన్‌ గన్‌ మాయమైన కేసులో సీఐ సహా ఐదుగురిపై సస్పెన్షన్‌ వేటు వేశారు. 2017 జూలై ప్రాంతంలో హుస్నాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి ఈ రెండు తుపాకులు మాయమయ్యాయి. ఈ సమయంలో ఎస్‌ఐగా పనిచేసిన ప్రస్తుతం సీఐడీ సీఐగా పనిచేస్తున్న సంజయ్‌తో పాటు అప్పటి కానిస్టేబుళ్లు మణెమ్మ, సంపత్‌, మనోజ్‌, అశోక్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉన్నతాధికారులు మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. 

Also Read సిద్దిపేట కాల్పుల కేసులో సంచలనం... ఆ ఏకే-47 పోలీసులదేనా...?.

గత నెలలో అక్కన్నపేట మండల కేంద్రంలో ప్రహరీ గోడ విషయంలో గొడవపడిన ఇదే గ్రామానికి చెందిన సదానందం అనే వ్యక్తి తన ప్రత్యర్థులపై ఏకే 47తో కాల్పులు జరిపాడు. దీంతో తుపాకుల విషయం బయటకు పొక్కింది. కాల్పులకు పాల్పడిన సదానందాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపగా తానే స్వయంగా పోలీస్‌స్టేషన్‌ నుంచి రెండు ఆయుధాలను ఎత్తుకెళ్లినట్లు ఒప్పుకున్నాడు.

 దాదాపు మూడు సంవత్సరాల తర్వాత తుపాకులు దొరకడంతో ఈ అంశంపై పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక విచారణ చేపట్టారు. తుపాకులు చోరీకి గురైన సమయంలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది కారణంగానే ఈ సంఘటన జరిగినట్లు గుర్తించిన అధికారులు చర్యలకు పూనుకున్నారు. అందులో భాగంగానే ఐదుగురిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని ఏసీపీ మహేందర్‌ ధ్రువీకరించారు.