హైదరాబాద్‌ : అక్రమంగా బంగారం తరలిస్తూ ప్రయాణికులు దొరికారు. విదేశీయులు దొరికారు. కానీ ఎయిరిండియా ఉద్యోగి అక్రమంగా తరలిస్తూ డీఆర్ఐ అధికారులకు పట్టుబడటం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే ఎయిర్ ఇండియా ఉద్యోగి నాలుగున్నర కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డారు. 

దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో అక్రమంగా బంగారం తరలిస్తున్నట్లు డీఆర్ఐ అధికారులకు సమాచారం అందింది. దీంతో అధికారులు విమానంలో వచ్చిన ప్రయాణికులను అందర్నీ తనిఖీ చేశారు. అయితే ఎయిర్ ఇండియా ఉద్యోగిపై అధికారులకు అనుమానం వచ్చింది. 

అతనిపై నిఘాపెట్టారు. ఈనేపథ్యంలో సదరు ఉద్యోగి ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చి మరో వ్యక్తికోసం వెతుకుతుండగా డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. దీంతో అక్రమ రవాణా గుట్టు రట్టయ్యింది. 

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని దగ్గర నుంచి 4.194 కేజీల స్మగల్డ్ బంగారం స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ రూ.1.34 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. బంగారంతోపాటు రూ. 3.6 లక్షల దేశీయ కరెన్సీని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌, హైదరాబాద్‌ జోనల్‌ యూనిట్‌(డీఆర్‌ఐ హెచ్‌జీయూ) అధికారులు సీజ్‌ చేశారు.  .

ఉద్యోగితో పాటు, బంగారాన్ని తీసుకోవడానికి వచ్చిన మరో ఇద్దర్నీ కూడా డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారిస్తున్నారు. ఇంత బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? ఉద్యోగి ఎప్పడి నుంచి ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.? ఈ బంగారాన్ని, నగదును ఎక్కడికి చేరవేస్తున్నారు? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.