Asianet News TeluguAsianet News Telugu

భైంసా మున్సిపాలిటీ మజ్లీస్ కైవసం...బోణీ కూడా కొట్టని తెరాస, కాంగ్రెస్

భైంసా మునిసిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార తెరాస కు భారీ షాక్ తగిలింది. ఈ మునిసిపాలిటీలో ఒక్కటంటే ఒక్క వార్డును కూడా తెరాస కైవభాసం చేసుకోలేకపోవడం గమనార్హం. ఎంఐఎం  ఈ మునిసిపాలిటీని కైవసం చేసుకోవడం విశేషం. 

AIMIM wins Bhainsa municipality... TRS, congress fails to open its account
Author
Bhainsa, First Published Jan 25, 2020, 1:19 PM IST

భైంసా: భైంసా మునిసిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార తెరాస కు భారీ షాక్ తగిలింది. ఈ మునిసిపాలిటీలో ఒక్కటంటే ఒక్క వార్డును కూడా తెరాస కైవభాసం చేసుకోలేకపోవడం గమనార్హం. ఎంఐఎం  ఈ మునిసిపాలిటీని కైవసం చేసుకోవడం విశేషం. 

కౌంటింగ్ మొదలయినప్పటినుండి కూడా ఇక్కడ బీజేపీ, ఎంఐఎం ల మధ్య నువ్వానేనా అన్నట్టుగా పోటీ సాగింది. 26 వార్డులకు గాను ఎంఐఎం 15 వార్డుల్లో విజయ ఢంకా మోగించి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. బీజేపీ 9 వార్డుల్లో విజయం సాధించగా... స్వతంత్రులు రెండు వార్డుల్లో గెలిచారు. 

తెరాస, కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ మచ్చుకి కూడా కనపడకపోవడం విశేషం. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస ఇక్కడ ఎటువంటి ప్రభావాన్ని కూడా చూపెట్టకపోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అసలే సున్నితమైన ప్రాంతం అవడం వల్ల ఇక్కడ పోలీసులు భారీ స్థాయిలో మోహరించారు. 

ఒక వారం రోజుల కింద, సంక్రాంతికి ముందు భైంసా పట్టణంలో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఆ గొడవలు సద్దుమణగడానికి ఊరిలో ఇంటర్నెట్ సేవలను ఆపేయాల్సి కూడా వచ్చింది. 

ఆదివారం రాత్రి ( జనవరి 12వ తేదీ 9 గంటల ప్రాంతంలో)  ఒక వర్గానికి చెందిన యువకుడు బైక్ తో చేసిన అతి విన్యాసాలు ఈ ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. చిన్నగా మొదలైన  వివాదం పట్టణమంతా పాకి తీవ్రరూపం దాల్చి పట్టణం మొత్తంతో హింసకు కారణమయ్యింది.  

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మోటార్ సైకిల్ ను ఓ వీధిలో రాష్ గా డ్రైవింగ్ చేసుకుంటూ వెళుతూ ఓ  యువకుడు హంగామా చేశాడు. దీంతో స్థానిక యువకులు ఆ యువకున్ని పట్టకుని మందలించి వదిలివేశారు. అయితే ఇలా మందలించినవారు వేరే  వర్గానికి చెందినవారు కావడంతో వారిపై  ప్రతీకారం తీర్చుకోడానికి సదరు యువకుడు సిద్దమయ్యాడు. 

తన వర్గానికి చెందిన దాదాపు 400-500 మందిని తీసుకువెళ్లి తనను మందలించిన యువకులపై దాడికి పాల్పడ్డాడు. ఇలా వీరు ఆ వీధిలోని 18 ఇండ్లను తగలబెట్టి హింసాత్మక వాతావరణం సృష్టించారు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలను సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినాకూడా వినిపించుకోని అల్లరిమూకలు పోలీసులపై రాళ్ళ దాడి చేస్తూ ఫైర్ ఇంజన్ వాహనాల పైపులను కోయడం జరిగింది. ఈ దాడులనే అదునుగా  చేసుకుని పలువురి ఇళ్లను కూడా లూటీ చేసినట్లు సమాచారం.

 ఈ ఘటనలో 8మంది పోలీసులకు తీవ్ర గాయాలు అయ్యాయి. అలాగే 18 ఇండ్లు ద్వంసమవగా అనేక ఇండ్లలో లూటీ జరిగింది. మరికొందరు యువకులకు కూడా గాయాలయినట్లు తెలుస్తోంది. ఈ  అల్లర్ల నేపథ్యంలో బైంసా పట్టణంలో ఇంటర్నెట్ సేవలు నిలిపేసిన పోలీసులు కట్టుదిట్టమైప బందోబస్తును ఏర్పాటుచేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios