మహబూబ్  నగర్ జిల్లాలో డిసిసిబి ఎన్నికలు కొత్త సమీకరణకు దారి తీశాయి. జిల్లాకు చెందిన  ఇద్దరు మంత్రులు ప్రతిపాదించిన జాబితా కాకుండా  టిఆర్ ఎస్ పార్టీ తో స్నేహ పూర్వక పార్టీ అయిన ఎంఐఎం సూచించిన అభ్యర్థికి డిసిసిబి పదవి దక్కిందన్న చర్చ మొదలైంది. 

మున్సిపల్ ఎన్నికల్లో పలు చైర్మన్ స్థానాలను అడిగిన ఎంఐఎం  అప్పట్లో గులాబి పార్టీ అంగీకరించకపోవడంతో సైలెంట్ అయింది. ఆ వెంటనే వచ్చిన సహకార ఎన్నికల్లో  మైనార్టీలకు ఒక స్థానాన్ని కట్టబెట్టాలని  పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసిఆర్ ముందు ఎంఐఎం ప్రతిపాదనలు ఉంచడంతో సిఎం కేసిఆర్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం మొదలైంది.

పాలమూరు జిల్లానేతల మధ్య ఉన్న  ఆధిపత్య పోరు కూడా ఇందుకు కారణమైందన్న అభిప్రాయం పార్టీ నేతల్లో వినిపిస్తోంది. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డిలు తమ అనుచరుల కోసం పట్టు బట్టడంతో ఇద్దరినీ కాకుండా మరో వ్యక్తికి డిసిసిబి చైర్మన్  పదవిని  పార్టీ కట్టబెట్టిందన్న చర్చ జోరుగా మొదలైంది. 

read more  అది ఔదార్యం కాదు సురభి నాటకం: వృద్ధుడికి కేసీఆర్ సాయంపై రేవంత్ వ్యాఖ్యలు

నిన్న మొన్నటి వరకు డిసిసిబి చైర్మన్ పదవికి ప్రతిపాదనల్లో ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి, రఘు నందర్ రెడ్డి,  గురునాథ్ రెడ్డి, జూపల్లి భాస్కర్ రావ్ లాంటి పేర్లు ఒక్క రోజులోనే తెరమరుగై ...కొత్తగా నిజాం పాషా  పేరును పార్టీ హై కమాండ్ ఖరారు చేయడంతో...దీనికి వెనుక జరిగిన తతంగంపై పార్టీ నేతలు ఆరా తీసినట్లు తెలుస్తోంది.  

ఎంఐఎం అధినేత సూచనల మేరకే నిజాంపాషాకు డిసిసిబి చైర్మన్ పదవిని కట్టబెట్టినట్లు పార్టీ నేతలో  అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ అనుభవం ఉన్న నిజాం పాషా గులాబీ పార్టీ లో ఒక్క సారిగా డీసీసీబీ పదవి దక్కించుకోవడం హాట్ టాపిక్ గా మారింది. జిల్లాలో మంత్రులు ఆదిపత్యం కోసం  పావులు కదిపినా...పార్టీ హై కమాండ్ తీసుకున్ననిర్ణయం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.