తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ .. ఆ హోదాలో ఆయనేం చేస్తారంటే..?
తెలంగాణ శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వ్యవహరించనున్నారు. శనివారం ఉదయం 8.30 గంటలకు ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీతో రాజ్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించనున్నారు.
డిసెంబర్ 9 శనివారం తెలంగాణ అసెంబ్లీ సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రొటెం స్పీకర్ ఎన్నిక, కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరగనుంది. తెలంగాణ శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వ్యవహరించనున్నారు. శనివారం ఉదయం 8.30 గంటలకు ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీతో రాజ్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించనున్నారు. అనంతరం అసెంబ్లీ చేరుకుని శాసనసభ సమావేశాన్ని ఒవైసీ ప్రారంభించనున్నారు. ఆపై కొత్త ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ హోదాలో అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణం చేయించనున్నారు.
సర్వ సాధారణంగా కొత్తగా అసెంబ్లీ కొలువుదీరినప్పుడు సభలో అందరికంటే సీనియర్ శాసనసభ్యుడిని ప్రొటెం స్పీకర్‌గా ఎన్నుకుంటారు. ఆయన కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించి.. స్పీకర్‌ను ఎన్నుకునే వరకు బాధ్యతలు నిర్వర్తించాల్సి వుంటుంది. ఈసారి తెలంగాణ అసెంబ్లీకి ఎవరు ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సభలో సీనియర్ ఎమ్మెల్యేగా వున్నది మాజీ సీఎం కేసీఆర్. ఆయన ఇప్పటి వరకు 8 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు.
ఆ తర్వాత బీఆర్ఎస్‌కు చెందిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్.. కాంగ్రెస్ నుంచి తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఆరుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయితే వీరిద్దరూ మంత్రులుగా నియమించబడటంతో అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేశారు. ఈయన చాంద్రాయణగుట్ట నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
మరోవైపు.. అక్బరుద్దీన్ ఒవైసీ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరిస్తే తాను ఆయన ముందు ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనని సంచలన వ్యాఖ్యలు చేశారు గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. రేపు భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుని, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో సమావేశమైన తర్వాత తదుపరి కార్యాచరణను వెల్లడించనున్నారు రాజాసింగ్.