ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు.
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఎక్కడెక్కడ పోటీ చేస్తామనేది ఎన్నికలకు ముందు ప్రకటిస్తామని చెప్పారు. అసదుద్దీన్ ఒవైసీ ఈరోజు నిజామాబాద్ జిల్లా జైలులో ఉన్న బోధన్ ఎంఐఎం కార్యకర్తలతో ములాఖత్ అయ్యారు. తనపై హత్యాయత్నం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ ఫిర్యాదుతో పోలీసులు ఎంఐఎం కార్యకర్తలను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం జైలులో ఉన్నవారిని అసదుద్దీన్ ఒవైసీ పరామర్శించారు.
అనంతరం అసదుద్దీన్ ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ.. ఎంఐఎం నేతలు, కౌన్సిలర్లపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. ఈ విషయాన్ని రాష్ట్ర డీజీపీ, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. అరెస్ట్ అయిన ఎంఐఎం నేతలు.. గతంలో బీఆర్ఎస్ గెలుపు కోసం పనిచేశారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ.. బోధన్‌లో పోటీ చేస్తుందని అన్నారు. ఎమ్మెల్యే షకీల్‌కు తగిన బుద్ది చెబుతామని అన్నారు.
తెలంగాణలో దళితులకు దళితబంధు ఇస్తున్నట్టే.. ముస్లింకు ముస్లిం బంధు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముస్లింల్లో కూడా పేదలు ఎక్కువగానే ఉన్నారని అన్నారు. గతంలో ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినా.. ఎటువంటి స్పందన లేదని చెప్పారు. కొత్త సచివాలయ నిర్మాణ సమయంలో తొలగించిన మసీదులను వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. ఇక, పాట్నాలో ప్రతిపక్షాల సమావేశానికి తమను పిలవలేదని అన్నారు.
