బీజేపీ సభ్యుడిని పీఆర్వోను పెట్టుకోవడం అక్రమమంటూ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై ఫైరయ్యారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ చేస్తున్న ఫిర్యాదులు చూస్తుంటే అనుమానం కలుగుతోందని ఒవైసీ అన్నారు.
తెలంగాణ గవర్నర్ (telangana governor) తమిళిసై సౌందరరాజన్‌పై (Tamilisai Soundararajan) ఎంఐఎం (aimim) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (asaduddin owaisi) సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీ సభ్యుడిని పీఆర్వోను పెట్టుకోవడం అక్రమం అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.. తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ చేస్తున్న ఫిర్యాదులు చూస్తుంటే అనుమానం కలుగుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాగా.. రాష్ట్రంలో గవర్నర్ తమిళిసైకి, సీఎం కేసీఆర్‌కి మధ్య అంతర్గత వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. అది కాస్తా తీవ్రమై.. గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రానికి ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో చోటు చేసుకున్న పలు అంశాలపై నివేదికలు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు కూడా. ఖమ్మం , రామాయంపేట ఘటనలు, మెడికల్ పీజీ సీట్ల బ్లాక్ దందాపై నివేదిక ఇవ్వాల్సిందిగా గవర్నర్ ఆదేశించారు.
కాగా.. తెలంగాణలో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు ముఖ్యమంత్రి కేసీఆర్ (cm kcr) చిక్కులు తెచ్చిపెట్టేలా ఉన్నాయి. రామాయంపేటకు (ramayampet) చెందిన తల్లీకొడుకు ఆత్మహత్య, ఖమ్మంలో (khammam) బీజేపీ (bjp) కార్యకర్త ఆత్మహత్య.. ఈ రెండు ఘటనల్లో టీఆర్ఎస్ నాయకులపై ఆరోపణలు ఉన్నాయి. తాజాగా మహిళపై వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదు రావడంతో.. కూకట్‌పల్లి టీఆర్ఎస్ కో-ఆర్డినేటర్ సతీష్ అరోరాపై పోలీసులు కేసు నమోదు చేశారు. వరుసగా టీఆర్‌ఎస్ నాయకులు వివాదాలకు కేంద్ర బిందువులుగా మారడంతో.. పార్టీ అధిష్టానానికి చిక్కులు వచ్చి పడ్డాయి. మరోవైపు ఈ ఘటనలపై ప్రతిపక్షాలు కూడా ఘాటుగానే స్పందిస్తున్నాయి. సొంత పార్టీ నేతలు తప్పులు చేస్తే.. సీఎం కేసీఆర్ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని ప్రశ్నిస్తున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
రామాయంపేటకు చెందిన పద్మ, ఆమె కుమారుడు సంతోష్ (santosh) ఆత్మహత్య చేసుకోవడానికి ముందు టీఆర్ఎస్ నాయకుల నుంచి తాము వేధింపులు ఎదుర్కొంటున్నట్టుగా ఆరోపించారు. వారి కారణంగానే తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని చెప్పారు. రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ యాదగిరి, సీఐ నాగార్జున గౌడ్‌తో సహా మొత్తం ఏడుగురు తమ ఆత్మహత్యకు కారణమని వారు చెప్పారు. అయితే ఈ ఘటనకు సంబంధించి అఖిలపక్ష నేతలు రామాయంపేట బంద్ కూడా నిర్వహించాయి. బాధిత కుటంబాన్ని ప్రతిపక్ష పార్టీలు పరామర్శించాయి. నిందితులు అధికార పార్టీకి చెందినవారు కావడంతోనే పోలీసులు విచారణ సరైన రీతిలో జరపడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయి గణేష్ (sai ganesh) .. పోలీస్ స్టేషన్ వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అయితే తర్వాత హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. సాయి గణేష్ ఆత్మహత్య చేసుకోవడానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, టీఆర్ఎష్ నాయకుడు, కార్పొరేటర్ భర్త ప్రసన్న కృష్ణ కారణమని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. సాయి గణేష్ మరణ వాంగ్మూలం ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రి పువ్వాడ, ప్రసన్న కృష్ణ, త్రీ టౌన్ సీఐ వేధింపులు తట్టుకోలేకే సాయి గణేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని.. వారిపై చర్యలు తీసుకోవాలని అతని అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే మంత్రి పువ్వాడకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
