హైదరాబాద్: పీసీసీ నియామకం సంక్లిష్టంగా మారిందని ఎఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ చెప్పారు. 

బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో కీలకమైన పదవులు రెడ్డి సామాజిక వర్గానికి కట్టబెట్టడం సరైంది కాదని చెప్పారు.

సోనియాగాంధీకి తప్పుడు సమాచారం ఇచ్చారని మధుయాష్కీ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ చెప్పిందే ఫైనల్ కాదని చెప్పారు.  రాష్ట్రంలో ఏం జరుగుతోందో అధిష్టానానికి తెలుసునని ఆయన చెప్పారు.

నాగార్జునసాగర్ ఎన్నికల వరకు పీసీసీ అధ్యక్షుడి నియామకం ఆగుతోందని ఆయన చెప్పారు.  నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానంలో గత ఎన్నికల్లో బీసీ నాయకుడి చేతిలో జానారెడ్డి ఓటమి పాలైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

also read:కొనసాగుతున్న సస్పెన్స్: టీపీసీసీ చీఫ్ కొత్త నేత ఎంపికకు తాత్కాలిక బ్రేక్

పార్టీలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వకుంటే నష్టం జరగదా అని ఆయన ప్రశ్నించారు.భువనగిరి ఎంపీ స్థానం నుండి పోటీ చేయాలని గతంలో కోమటిరెడ్డి బ్రదర్స్ తనను కోరారని చెప్పారు. 

కానీ చివరి నిమిషంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ స్థానం నుండి పోటీ చేశారని మధు యాష్కీ చెప్పారు. భువనగిరిలో పోటీ విషయంలో తనను కోమటిరెడ్డి బ్రదర్స్ మోసం చేశారని ఆయన తెలిపారు. తాను కూడ నియోజకవర్గం మారితే విజయం సాధిస్తానని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

పార్టీకి రెడ్లతోనే అధికారం రాదన్నారు. రెడ్లు, బీసీలు కలిస్తేనే పార్టీకి అధికారం దక్కుతోందని ఆయన చెప్పారు.