హైదరాబాద్: యూరియాను ఎక్కడైనా అధిక ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఆదివారం నాడు వ్యవసాయ శాఖాధికారులతో మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి వరకు 33,800 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేసినట్టుగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.ఇవాళ  16,374 మెట్రిక్ టన్నుల యూరియా రేక్ పాయింట్ల  నుండి రవాణామార్గంలో గ్రామాలకు చేరుతుందన్నారు.

వివిధ పోర్టుల నుండి, ఇతర రాష్ట్రాల నుండి రైళ్ల ద్వారా 17 వేల మెట్రిక్ టన్నుల యూరియా వస్తోందని మంత్రి తెలిపారు. రేక్ పాయింట్ల నుండి రేపు రాత్రి వరకు యూరియా నేరుగా గ్రామాలకు చేరనుందని మంత్రి తెలిపారు.

మరో 14 వేల మెట్రిక్ టన్నుల యూరియా లోడింగ్ కు సిద్దంగా ఉంది .. 12వ తేది నాటికి చేరుకుంటుందని మంత్రి చెప్పారు.  ఈ నెల 12వరకు రాష్ట్రానికి 90 వేల మెట్రిక్ టన్నుల యూరియా చేరుకొంటుందని మంత్రి స్పష్టం చేశారు.

జిల్లా వ్యవసాయ అధికారులు యూరియా నిల్వలు, సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. యూరియా త్వరగా రవాణా చేసేందుకు వివిధ ప్రాంతాలకు వెళ్లిన అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆయన కోరారు.