సికింద్రాబాద్ విధ్వంసం కేసులో పోలీసులు అదుపులో మరో ఏడుగురు..!
సికింద్రాబాద్ అల్లర్ల కేసులో మరో ఏడుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఆవుల సుబ్బారావును అరెస్ట్ చేసినట్లుగా శుక్రవారం వార్తలు వచ్చాయి. అయితే అతని అరెస్ట్ ఆలస్యమయ్యే అవకాశాలున్నట్టు ఈనాడు పత్రిక కథనం ప్రకారం సమాచారం.
హైదరాబాద్ : అగ్నిపథ్ ప్రకటనకు నిరసనగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జూన్ 17న జరిగిన విధ్వంసం కేసులో సూత్రధారిగా వ్యవహరించిన ఆవుల సుబ్బారావు అరెస్టు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రముఖ దినపత్రిక ఈనాడు కథనం. దీని ప్రకారం.. ఈ కేసులో మరో ఏడుగురు నిందితులను ఉత్తర మండలం టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం రైల్వే పోలీసులకు అప్పగించారు. ఈ ఏడుగురు సుబ్బారావు అనుచరులేనని రైల్వే పోలీసులు ఆధారాలు సేకరించారు. అంతకుముందు సుబ్బారావుతో సహా ఎనిమిది మందిని గాంధీ ఆస్పత్రికి తరలించి, వైద్య పరీక్షలు నిర్వహించి, రైల్వే పోలీస్ ఠాణాకు తరలించారు. తాజాగా అదుపులోకి తీసుకున్న వారిని కూడా విచారించిన తరువాత సుబ్బారావు న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సుబ్బారావు నేరం చేశాడని ఆధారాలు లేవు..
అయితే, సికింద్రాబాద్ విధ్వంసం కేసులో ఆవుల సుబ్బారావు ప్రత్యక్షంగా పాల్గొన్నాడనే ఏ ఆధారాలు లేవని ఆయన తరఫు న్యాయవాది రైల్వే స్టేషన్ వద్ద విలేకరులతో అన్నారు. శాంతియుతంగా నిరసన తెలపాలని ఆయన ఆర్మీ అభ్యర్థులకు సూచించాడని 17వ తేదీ సుబ్బారావు సికింద్రాబాద్ లో లేడని, బోడుప్పల్ లోని సాయి డిఫెన్స్ అకాడమీ లో ఉన్నాడు అన్నారు. ఆయన నేరానికి పాల్పడినట్లు ఆధారాలు లేకపోవడం వల్లనే పోలీసులు ఇన్నిరోజులు అదుపులో ఉంచుకున్నారన్నారు.
కాగా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసం కేసులో సాయి డిఫెన్స్ అకాడమీకి చెందిన ఆవుల సుబ్బారావు కీలకంగా వ్యవహరించారని రైల్వే సిట్ పోలీసులు శుక్రవారం గుర్తించారు. శుక్రవారం ఆయనను అరెస్టు చేసినట్లుగా ప్రముఖ తెలుగు న్యూస్ టీవీ చానెల్ ఎన్టీవీ ప్రకటించింది. ఈ నెల 17న మరో ఆరు డిఫెన్స్ కోచింగ్ సెంటర్ లతో కలిసి విధ్వంసానికి ప్లాన్ చేశారని సమాచారం. శివ, మల్లారెడ్డి, హరీ అనే అనుచరులతో కలిసి ఆవుల సుబ్బారావు విధ్వంసానికి పాల్పడ్డారు అని ఎన్టీవీ కథనం చెబుతోంది. ఈనెల 16న ఆవుల సుబ్బారావు హైదరాబాద్ కు చేరుకున్నాడు. ఓ హోటల్ లో అనుచరులతో కలిసి విధ్వంసానికి ప్లాన్ చేశాడని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారని ఈ కథనం వెల్లడించింది.
ఆందోళనలు చేయాలని వాట్సాప్ గ్రూపుల్లో రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టారని కూడా పోలీసులు గుర్తించారు. మూడు రోజులుగా ఆవులు సుబ్బారావును టాస్క్ ఫోర్స్ పోలీసులు, రైల్వే పోలీసులు విచారించారు. ఈ విచారణ సమయంలో కీలక విషయాలను పోలీసులు గుర్తించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శాంతియుతంగా ఆందోళన చేయాలని కోరినట్లుగా తొలుత పోలీసుల విచారణలో ఒప్పుకున్నారని సమాచారం. అయితే పోలీసులు తాము సేకరించిన ఆధారాలను సుబ్బారావు ముందు పెట్టి ప్రశ్నించారు. సుబ్బారావ్ ఆదేశాల మేరకే తాము విధ్వంసానికి పాల్పడినట్లు కొందరు ఆర్మీ అభ్యర్థులు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారని కథనం తెలిపింది.
శుక్రవారం సాయంత్రంలోగా సుబ్బారావు రిమాండ్కు తరలించే అవకాశముందని సమాచారం. సాయి డిఫెన్స్ అకాడమీకి చెందిన 12 సెంటర్ లతో పాటు మరో 6 డిఫెన్స్ అకాడమీలతో కూడా ఆవుల సుబ్బారావు మాట్లాడారని పోలీసులు గుర్తించారు. అందుకే ఈ ఆరు డిఫెన్స్ అకాడమీలపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విధ్వంసం జరిగిన రోజు రాత్రి 9 గంటల వరకు ఆవుల సుబ్బారావు బోడుప్పల్ లోని తన డిఫెన్స్ అకాడమీలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. రాత్రి 9 గంటల సమయంలో సుబ్బారావు కారులో గుంటూరుకి వెళ్లిపోయినట్టుగా పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు.