రెండు రోజులు తెరిపినిచ్చిన వరుణ దేవుడు హైదరాబాద్‌పై మరోసారి తన ప్రతాపం ప్రదర్శిస్తున్నాడు. శనివారం సాయంత్రం నగరంలో మళ్లీ కుంభవృష్టి మొదలైంది.

చైతన్యపురిలో కురిసిన భారీ వర్షానికి వరద నీరు రోడ్లను ముంచెత్తింది. వరదలో కొట్టుకుపోతోన్న నలుగురిని కమలానగర్ కాలనీవాసులు రక్షించారు. కాగా క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో భారీ వాన కురుస్తోంది.

ఇటీవల కురిసిన వర్షాలకు బైకులు, కార్లు కొట్టుకుపోవడం, ఇప్పుడు మళ్లీ వర్షం మొదలవ్వడంతో వాహనదారులు భయాందోళనలకు గురవుతున్నారు. వర్షం కారణంగా ఇళ్లకు త్వరగా వెళ్లేందుకు జనం కంగారు పడుతున్నారు.

దీంతో హైదరాబాద్ ప్రధాన జంక్షన్లలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

నగరాన్ని సాధారణ స్థితికి తెచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని.. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి సీఎం రిలీఫ్ కిట్ అందజేస్తామని మంత్రి వెల్లడించారు. ఈ కిట్‌లో రూ.2,800 విలువైన నిత్యావసర వస్తువులతో పాటు 3 రగ్గులు ఉంటాయని కేటీఆర్ ప్రకటించారు.