సంగారెడ్డి: బొల్లారం పారిశ్రామికవాడలోని వింధ్య ఆర్గానిక్స్ పరిశ్రమలో మళ్లీ అగ్నిప్రమాదం సంభవించింది. పరిశ్రమలో మూడు బ్లాకులున్నాయి. మంటలు మూడో బ్లాక్ లోకి వ్యాపించాయి. మరో రియాక్టర్ పేలిపోతే తీవ్ర ప్రమాదం సంభవించే అవకాశం ఉంది.

ఫైరింజన్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు అదుపులోకి వచ్చాయని భావిస్తున్న తరుణంలో మూడో బ్లాక్ లోకి మంటలు చెలరేగాయి. 

ఇదిలావుంటే, బొల్లారం పారిశ్రామికవాడలోని వింధ్య ఆర్గానిక్స్ పరిశ్రమలో సంభవించిన పేలుడు ఘటనలో పెను ప్రమాదం తప్పింది. మధ్యాహ్న భోజన విరామ సమయం కావడంతో పెను ప్రమాదం తప్పింది. కార్మికులు చాలా మంది మధ్యాహ్నం భోజనానికి వెళ్లారు. దానివల్ల ప్రాణ నష్టం జరగలేదని భావిస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ప్రమాదం సంభవించింది,.

ప్రమాద సమయంలో పరిశ్రమలో 40 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్డీఆర్ఎఫ్ నహాయక చర్యలు చేపట్టింది. రియాక్టర్ పేలడంతో భారీ శబ్దం వచ్చింది. దీంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. రియాక్టర్ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్లనే ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. 

కోవిడ్ కారణంగా సాంకేతిక నిపుణుడు రావడం లేదని, దాంతో అనుభవం లేనివారు దాన్ని నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. ప్రమాదంలో 8 మంది తీవ్రంగా గాయపడినట్లు డీఎస్పీచెప్పారు. ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడినవారి వాంగ్మూలాలు సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. మంటలు ఆరినప్పటికీ పొగ వ్యాపిస్తూనే ఉంది.  ఐదు ఫైరింజన్లు మంటలను ఆర్పేశాయి. ప్రమాదంపై పోలీసుుల దర్యాప్తు చేస్తున్నారు. ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ ప్రవీణ్ కుమార్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు.  పరిశ్రమలో మూడు రియాక్టర్లు ఉన్నాయి. వాటిలో ఓ రియాక్టర్ పేలడంతో ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. 

తెలంగాణలోని సంగారెడ్డి ఐడీఎ బొల్లారం పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. వింధ్య ఆర్గానిక్స్ పరిశ్రమలో పేలుళ్లు సంభవించాయి. దీంతో పెద్ద యెత్తున మంటలు ఎగిసిపడ్డాయి..