Asianet News TeluguAsianet News Telugu

హుజూర్‌నగర్‌లో ఓటమి ఎఫెక్ట్: ఉత్తమ్‌ను పీసీసీ చీఫ్ నుండి తప్పిస్తారా?

హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానంలో ఓటమి పాలు కావడంతో పీసీసీ చీఫ్ కు కొత్త వారిని నియమించే విషయమై చర్చ జోరుగా సాగుతోంది. పీసీసీ చీఫ్ పదవి కోసం మరోసారి నేతలు లాబీయింగ్ చేసే అవకాశం ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డిని పీసీసీ చీఫ్ పదవి నుండి తప్పించే ఛాన్స్ లేకపోలేదనే ప్రచారం సాగుతోంది.

After rout, Congress may overhaul TPCC
Author
Hyderabad, First Published Oct 25, 2019, 7:45 AM IST

హైదరాబాద్: హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలు కావడంతో పీసీసీ చీఫ్ పదవి మార్పుపై కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. కొంత కాలంగా పీసీసీ చీఫ్ పదవి మార్పుపై ప్రచారం సాగుతోంది.

టీపీసీసీ చీఫ్‌గా ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవి కాలం ముగిసింది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కొంత దిగొచ్చారు. ఈ సమయంలో పార్లమెంట్ ఎన్నికల వరకు పీసీసీ చీఫ్ పదవిలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని కొనసాగించాలని ఎఐసీసీ నిర్ణయం తీసుకొంది.

పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా విజయం సాధించాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించిన తర్వాత  హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి తన భార్య పద్మావతిని అభ్యర్థిని ఫైనల్ చేశారు.

ఈ సమయంలో పద్మావతి ఎంపిక విషయంలో రేవంత్ రెడ్డి బహిరంగంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డిపై విమర్శలు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.ఇదే విషయమై తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ కుంతియాపై కూడ కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియాగాంధీకి ఫిర్యాదు చేశారు.

ఈ ఏడాది నవంబర్ మాసంలో మున్సిపల్ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఎదుర్కోవాలంటే పీసీసీ చీఫ్ ను మార్చాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ కుంతియాతో పాటు పీసీసీ చీఫ్ పదవిలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని మార్చాలనే అభిప్రాయంతో ఉన్నారు.

హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ , తమకు మధ్య గట్టిపోటీ ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావించారు.ఒకవేళ ఓటమి చెందినా కూడ టీఆర్ఎస్ కు స్వల్ప మెజారిటీ మాత్రమే వచ్చే అవకాశం ఉందని భావించారు.

కానీ, హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 43 వేల ఓట్ల మెజారిటీతో ఓటమి పాలైంది.ఈ పరిణామం రాజకీయంగా కాంగ్రెస్ నాయకత్వాన్ని తీవ్ర నిరాశలో పడేసింది.దీంతో మరోసారి పీసీసీ చీఫ్ పదవి మార్పు విషయమై కాంగ్రెస్ నేతలు ఎఐసీసీ  వద్ద డిమాండ్ చేసే అవకాశం ఉంది.

ఈ ఎన్నికల ఫలితాలు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడ ఎదురుదెబ్బగానే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి కూడ బీజేపీ వైపు వెళ్లాలని భావించారు. కానీ హుజూర్ నగర్ ఉప ఎన్నకల్లో బీజేపీ నాలుగో స్థానానికి మాత్రమే పరిమితమైంది.

మరో వైపు పీసీసీ చీఫ్ పదవి విషయంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడ పోటీలో ఉన్నాడు. కొత్త పీసీసీ చీఫ్ నియామకం తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరే విషయమై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios