కాంగ్రెస్ ఫిర్యాదుతోనే నిలిచిన రైతు బంధు నిధులు: జుక్కల్ సభలో కేసీఆర్
తెలంగాణ ఏర్పడక ముందు తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో జరిగిన అభివృద్దిని పరిశీలించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు.
జుక్కల్:కాంగ్రెస్ ఫిర్యాదుతో కొందరికి రైతు బంధు నిధులు అందలేదని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. సోమవారంనాడు జుక్కల్ లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈసీ అనుమతి తీసుకొని రైతు బంధు నిధులను విడుదల చేస్తామని కేసీఆర్ వివరించారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతు రుణమాఫీ లేదని కేసీఆర్ చెప్పారు. రైతు బంధు వృధా అని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారన్నారు. రైతు బంధు ఇవ్వాలా వద్దా అని కేసీఆర్ ప్రజలను కోరారు. కాంగ్రెస్ ఫిర్యాదుతో కొందరికి రైతు బంధు ఆగిందని కేసీఆర్ ఆరోపించారు. ఎన్నికల కమిషన్ అనుమతిచ్చిన వెంటనే రైతు బంధు నిధులను విడుదల చేస్తామన్నారు. రైతు బంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారని కేసీఆర్ చెప్పారు. రెండు దఫాల్లో రూ. 37 వేల కోట్ల రుణమాఫీ చేసుకున్నట్టుగా సీఎం కేసీఆర్ వివరించారు.
కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇవ్వకుండా ఆలస్యం చేసిందని ఆయన విమర్శించారు. తాను ఆమరణ నిరహారదీక్ష చేపట్టిన తర్వాతే కాంగ్రెస్ సర్కార్ తెలంగాణను ఇచ్చిందని కేసీఆర్ గుర్తు చేశారు.
తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నామని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తొలి నాళ్లలో గ్రామాల్లో మంచినీటికి ఎంతో సమస్య ఉండేదన్నారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచినీరు అందిస్తున్నామన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు తెలంగాణ ఏర్పాడిన తర్వాత జరిగిన అభివృద్ధిని పరిశీలించాలని ఆయన ప్రజలను కోరారు.
నిజాంసాగర్ ను సమైక్యపాలకులు ఎండబెట్టలేదా అని ఆయన ప్రజలను ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో నిజాంసాగర్ వద్దే సభలు నిర్వహించిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. నిజాంసాగర్ ను కాలేశ్వరం నీళ్లతో నింపుతామని సీఎం హామీ ఇచ్చారు.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలంగాణకు వచ్చి తమ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలను చూడాలని కోరిన విషయాన్ని సీఎం కేసీఆర్ ప్రస్తావిస్తూ కర్ణాటకలో వ్యవసాయానికి ఐదు గంటల విద్యుత్ ను సరఫరా చేస్తున్నారన్నారు. కర్ణాటక రాష్ట్రం ఎప్పటి నుండో ఉంది... పెద్ద రాష్ట్రమన్నారు. తెలంగాణ ఏర్పడి 9 ఏళ్లు అవుతుంది.. అయినా తమ రాష్ట్రంలో రైతాంగానికి 24 గంటల పాటు విద్యుత్ ను సరఫరా చేస్తున్న విషయాన్ని కేసీఆర్ చెప్పారు. ప్రధానమంత్రి స్వంత రాష్ట్రం గుజరాత్ లో కూడ వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా జరగడం లేదన్నారు. తెలంగాణలో పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే కరెంట్ ఉండదని సీఎం చెప్పారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం నెరవేర్చిందని ఆయన తెలిపారు.దళితులను బాగుపర్చేందుకు దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చినట్టుగా సీఎం కేసీఆర్ చెప్పారు.ఎన్నికల్లో ఆలోచన చేసి ఓటు వేయాలని ఆయన ప్రజలను కోరారు.ఆగమాగం కాకుండా స్వంత విచక్షణతో ఓటు వేయాలని ఆయన సూచించారు.