Asianet News TeluguAsianet News Telugu

ఓవైసీ జీ... అంతలా కావాలంటే మీరే అప్ఘాన్ వెళ్లండి: విజయశాంతి చురకలు

తాలిబాన్లతో భారత ప్రభుత్వం చర్యలు జరపాలన్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసి వ్యాఖ్యలను బిజెపి నాయకురాలు విజయశాంతి తప్పుబట్టారు. 

afghan crisis...  bjp leader vijayashanthi satires on asaduddin owaisi
Author
Hyderabad, First Published Aug 19, 2021, 10:28 AM IST

హైదరరాబాద్: అప్ఘానిస్తాన్ లో అరాచకం సృష్టిస్తున్న తాలిబాన్లతో భారత ప్రభుత్వం చర్చలు జరపాలన్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసిపై బిజెపి నాయకురాలు విజయశాంతి విరుచుకుపడ్డారు. అంతలా తాలిబాన్లతో చర్చలు జరపాలని ఉవ్విళ్లూరుతుంటే స్వయంగా ఓవైసియే కాబూల్ వెళ్లాలని సూచించారు. అంతేకాని భారత ప్రభుత్వాన్ని తాలిబాన్లతో చర్చలు జరపాలని కోరవద్దని విజయశాంతి సూచించారు. 

''భారత్‌లోని ఆఫ్ఘన్ రాయబారి స్వయంగా తాలిబన్లను వ్యతిరేకిస్తూ, ఆ దేశంలో ఇంకా పోరాడుతున్న ఆఫ్ఘనిస్థాన్ ఉపాధ్యక్షుడిని సమర్థించినప్పుడు, తాలిబన్లలతో భారత్ చర్చలు జరపాలని చెప్పడంలో అంతరార్థమేమిటో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకే తెలియాలి. అంతకన్నా ఒవైసీ జీ స్వయంగా కాబూల్ వెళ్ళి తాలిబన్లలతో చర్చలు జరిపి వచ్చి, సమాచారం అందిస్తే ప్రస్తుత పరిస్థితుల్లో కొంత సమంజసంగా ఉంటుందేమో ప్రయత్నిస్తే మంచిది'' అంటూ విజయశాంతి ఎద్దేవా చేశారు. 

read more  ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకుపోయిన కరీంనగర్ వాసి.. ఆందోళనలో కుటుంబసభ్యులు

ఇక అప్ఘాన్ లో నెలకొన్న పరిస్థితులపై కూడా విజయశాంతి సోషల్ మీడియా వేదికన స్పందించారు. అక్కడ మహిళలపై తాలిబాన్లు చేస్తున్న అఘాయిత్యాలపై విజయశాంతి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు అప్ఘాన్ అల్లకల్లోలంపై విజయశాంతి ఫేస్ బుక్ లో తన ఆవేదనను వ్యక్తపరుస్తూ ఓ పోస్ట్ చేశారు. 

విజయశాంతి పేస్ బుక్ పోస్ట్ యధావిధిగా:

ఆప్ఘనిస్థాన్ పరిస్థితుల్ని చూస్తే గుండె చెరువైపోతోంది. 1996 నుంచి 2001 వరకూ అక్కడ చోటుచేసుకున్న పరిణామాల జ్ఞాపకాలు నేటికీ పీడకలలా వెంటాడుతూ స్మృతిపథం నుంచి చెరిగిపోకముందే మళ్ళీ నరరూప రాక్షసులైన తాలిబన్ల ఆటవికపాలన మొదలైంది. మహిళల్ని లైంగిక బానిసలుగా చేసి, పిల్లల్ని కనే యంత్రంలా మార్చేసి, విద్య-ఉద్యోగాలకు దూరం చేసిన దుర్మార్గపు రోజులు మళ్ళీ వచ్చేశాయి. నిబంధనలు పాటించని వారిని రాళ్లతో కొట్టి చంపడం, చిన్న తప్పులకే బహిరంగంగా కాళ్ళు, చేతులు నరకడం, మతగ్రంథంలోని నిబంధనలు అనుసరించకపోతే తల నరికేయడం, చెట్టుకు వేలాడదీసి ఉరివేయడం, బతికుండగానే తగులబెట్టడం లాంటి దారుణమైన మధ్యయుగపు మూర్ఖపు శిక్షలు వారికి నిత్యకృత్యం. 

బురఖా ధరించని ఒక నడివయసు మహిళను తలపై కాల్చి చంపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతటి నీచ నికృష్టమైన తాలిబన్ సర్కారును పాకిస్తాన్ గుర్తించి ఆ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని ప్రశంసించడంలో ఆశ్చర్యమేమీ లేదు గానీ... గొప్ప కమ్యూనిస్ట్ దేశాలుగా చరిత్రకెక్కిన చైనా, రష్యాలు కూడా వంతపాడటం దౌర్భాగ్యం. ఈ పరిణామాలపై మన దేశంలోని కమ్యూనిస్ట్ నేతలు, కాంగ్రెస్ నేతలు ఇంతవరకూ స్పందించనే లేదు. 

ఇదిలా ఉంటే తాలిబన్లతో చర్చలకు అవకాశముండాలంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కేంద్రానికి సలహా ఇచ్చి తన సంస్కారాన్ని చాటుకున్నారు. తాలిబన్ల కంటే పలు రెట్లు అధికంగా ప్రభుత్వ సైన్యం ఉన్నప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ భద్రతా దళాలు తోకముడిచాయి. ఇది పూర్తిగా దేశభక్తి, జాతీయవాద చైతన్యం లేని ఆ దేశ ప్రజల ఘోర వైఫల్యం తప్ప మరొకటి కాదు.

తాలిబన్లు కేవలం ఆప్ఘనిస్థాన్‌తో ఆగిపోరని, చైనా-పాక్ తోడ్పాటుతో దీర్ఘ కాలంలో వారి లక్ష్యం భారత్ అని కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో కనిపిస్తున్న పోస్టులను బట్టి తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో భారతీయుల ఐక్యతే శ్రీరామరక్ష.


 

Follow Us:
Download App:
  • android
  • ios