Asianet News TeluguAsianet News Telugu

నల్గొండలో కిరాతకం... కారుతో గుద్ది, వేటకొడవళ్లతో నరికి లాయర్ దారుణ హత్య

తెలంగాణ అడ్వోకేట్ల వరుస హత్యలు కలకలం రేపుతున్నారు. ఇటీవల ములుగు జిల్లాలో లాయర్ మల్లారెడ్డిని దారుణంగా చంపగా తాజాగా నల్గొండ జిల్లాలో మరో లాయర్ హత్యకు గురయ్యాడు. 

Advocate brutal murder on nalgonda district
Author
Nalgonda, First Published Aug 14, 2022, 8:53 AM IST

హైదరాబాద్ : తెలంగాణలో అడ్వోకేట్ల హత్యలు కొనసాగుతున్నాయి. మంథనిలో వామనరావు దంపతులు, ములుగులో మల్లారెడ్డి అనే లాయర్ల దారుణ హత్యలు మరిచిపోకముందే అలాంటి ఘోరమే తాజాగా చోటుచేసుకుంది. నల్గొండ జిల్లాలో జూనియర్ అడ్వోకేట్ గా పనిచేస్తున్న విజయ్ రెడ్డి (48) ని కొందరు దుండగులు కారుతో ఢీకొట్టి, కత్తులతో నరికి అతి కిరాతకంగా హతమార్చారు. ఈ దారుణ హత్య జిల్లాలో సంచలనం రేపగా దీని వెనుక  స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి హస్తం వుందని మృతుడి భార్య ఆరోపణ రాజకీయ దుమారం రేపుతోంది. 

వివరాల్లోకి వెళితే... నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామానికి చెందిన గాదె సంద్య-విజయ్ రెడ్డి భార్యాభర్తలు. విజయ్ రెడ్డి నల్గొండలో జూనియర్ అడ్వకేట్ గా పనిచేస్తున్నాడు. అతడికి రాజకీయాలపై కూడా ఆసక్తి వుండటంతో గత పంచాయితీ ఎన్నికల్లో భార్య సంధ్యను టీఆర్ఎస్ పార్టీ నుండి బరిలోకి దించి గెలిపించుకున్నాడు. కొంతకాలం అంతా సాఫీగా సాగినా ఇటీవల ఎమ్మెల్యే భూపాల్ రెడ్డితో ఈ దంపతులకు విబేధాలు తలెత్తాయి. దీంతో గ్రామాభివృద్దికి ఎమ్మెల్యేతో పాటు అధికారులు సహకరించడం లేదంటూ సంధ్య ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు. ఆమె రాజీనామాను జిల్లా కలెక్టర్ ఆమోదించకపోగా అక్రమాలకు పాల్పడినట్లు నిర్దారించి చెక్ పవర్ ను రద్దుచేసారు.

ఇలా ఎలాంటి అధికారాలు లేకపోయినా సర్పంచ్ గానే సంధ్య కొనసాగుతున్నారు. రాజకీయాలకు దూరంగా వుంటున్న దంపతులు నల్గొండలో నివాసముంటున్నారు. అయితే గ్రామంలో వ్యవసాయ భూమి వుండటంతో విజయ్ రెడ్డి రెండుమూడురోజులకు ఓసారి గ్రామానికి వచ్చి వ్యవసాయ పనులు చూసుకునేవాడు. ఇలా శనివారం ఉదయం కూడా వ్యవసాయ పనులకోసం బైక్ పై గ్రామానికి వెళ్ళాడు. పనులు ముగించుకుని తిరిగి నల్గొండకు వెళుతుండగా అతన్ని గుర్తితెలియని దుండగులు అతి దారుణంగా హతమార్చారు. 

Read More అవినీతిపై ఆర్టీఐకి దరఖాస్తు చేసినందుకు, దళిత యువకుడికి పాలేరు ఎమ్మెల్యే అనుచరుడి బెదిరింపులు

ఎల్లమ్మగూడెం గ్రామ శివారులో విజయ్ రెడ్డికోసం కాపుకాసిన దుండగులు అతడు బైక్ వస్తుండగా కారుతో ఢీకొట్టారు. దీంతో అతడు కిందపడిపోగా కారులోంచి నలుగురు గుర్తుతెలియని దుండుగులు కత్తులు, వేట కొడవళ్లతో దిగి విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. దీంతో రక్తపుమడుగులో పడి విజయ్ అక్కడికక్కడే మృతిచెందాడు. అతడు చనిపోయినట్లు నిర్దారించుకున్నాకే దుండగులు అక్కడినుండి వెళ్ళిపోయారు. 

ఈ దారుణ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హంతకులను గుర్తించి త్వరలోనే పట్టుకుంటామని తిప్పర్తి పోలీసులు తెలిపారు. 

అయితే మృతుడి భార్య, ఎల్లమ్మగూడెం సర్పంచ్ సంధ్య స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిపై అనుమానం వ్యక్తం చేసారు. తన భర్త హత్య వెనుక ఎమ్మెల్యే  హస్తముందని ఆమె ఆరోపిస్తున్నారు. స్థానిక టీఆర్ఎస్ నాయకుల సాయంతో ఎమ్మెల్యే ఈ హత్య చేయించారని కన్నీరుపెట్టుకుంటూ బాధిత మహిళ మీడియాకు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios