ఎంఐఎం పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు ఫారుక్ అహ్మద్ జిల్లా జైలులో ఆత్మహత్యకు ప్రయత్నించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గత ఏడాది డిసెంబర్ 18న ఆదిలాబాద్లోని తాటిగూడ కాలనీ లో ఆయన జరిపిన కాల్పుల ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆయన ఆత్మహత్య కు ప్రయత్నించాడా? జైల్లో ఘర్షణ జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి ..తర్వాత ఆత్మహత్యాయత్నం విషయం జైలు వర్గాల ద్వారా వెల్లడైంది. 

మధ్యాహ్న భోజన సమయంలో బాత్రూంలోకి వెళ్లి ఉరి వేసుకోవడాన్ని పహారాలో ఉన్న సిబ్బంది గమనించడంతో ఆయనకు ప్రాణాపాయం తప్పినట్లు అయింది. జైలులోనే వైద్యులు, వైద్య సిబ్బందితో పాటు అవసరమైన ఆక్సిజన్ అందుబాటులో ఉండడంతో సకాలంలో ప్రథమ చికిత్స అందించడానికి వీలు పడింది.

అనంతరం వెంటనే రిమ్స్ ఆసుపత్రికి, ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక బందోబస్తు మధ్య హైదరాబాద్ కు తరలించారు.  ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. 

జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తాల్లోజు ఆచారి బుధవారం జిల్లా జైలు సందర్శనకు వచ్చినందున ముందస్తుగానే ఆ శాఖ వరంగల్ రేంజ్ డీఐజీ రాజేష్ జిల్లా జైలుకు చేరుకున్నారు. అధికారులు, సిబ్బంది ఆ హడావిడిలో ఉన్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. 

జిల్లాలో ప్రముఖ రాజకీయ నాయకుడిగా ఎదిగిన ఫారుక్ అహ్మద్ కాల్పులకు పాల్పడి రిమాండ్లో ఉంటూ తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలుస్తోంది. వ్యక్తిగత ప్రాబల్యం,  కుటుంబ స్థితిగతులపై మనస్తాపానికి గురవ్వగా.. జైలు అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు సమాచారం.

దీనికి తోడు బెయిల్ తిరస్కరణ గురవడం, ప్రభుత్వం ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయడంతో మరింత కలత చెందాడు. బయటకు వస్తానో, లేదోనని బెంగతో చివరికి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. నిరంతరం జైలు సిబ్బంది పహారాలో ఇలాంటి ఘటన జరగడం జిల్లాలో ఇదే ప్రథమం కావడం  అధికార వర్గాల్లోనూ ఉత్కంఠకు దారితీసింది.