కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని ప్రీతి మృతి కేసులో ఆమె గదిలో దొరికిన ఇంజక్షన్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆమె తీసుకుందని భావించిన ఇంజక్షన్.. అక్కడ దొరికిన వాయిల్స్ వేరు వేరుగా ఉండడంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి.
వరంగల్ : వరంగల్ వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి (26) ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడుతూ కన్నుమూసింది. మెడికల్ పీజీ విద్యార్థిని అయిన ప్రీతి సీనియర్ల వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె నిమ్స్ లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ విషాదకర ఘటన అందరిని కలచివేసింది. ఆమె మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే ప్రీతి మృతి విషయంలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆమెది ఆత్మహత్య కాదని హత్య అని తండ్రి ఆరోపిస్తున్నట్లుగా కొన్ని మీడియా కథనాలు వెలువడుతున్నాయి.
ఆ మీడియా కథనాల ప్రకారం..
జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గిర్ని తండా కు చెందిన ధరావత్ నరేందర్ కూతురు ప్రీతి. నరేందర్ వరంగల్ లోని ఆర్పిఎఫ్ లో ఏఎస్ఐగా పని చేస్తున్నారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. భార్య పేరు శారద. కూతుర్లు పూజ, ఉష, ప్రీతి. కుమారుడు వంశీ. కొన్నేళ్ల క్రితం మొండ్రాయి గిర్ని తండా నుంచి హైదరాబాదులోని ఉప్పల్ కు వలస వచ్చారు. చిన్న కూతురైన ప్రీతి గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ పూర్తి. ఆ తర్వాత అనస్తీషియా పీజీ కోర్సులో చేరింది.
2022 నవంబర్ 18 వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ( కేఎంసి) పిజీలో చేరింది. పీజీ విద్యలో భాగంగా థ్రియట్రికల్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఎంజీఎం ఆసుపత్రిలోని సీనియర్ విద్యార్థులతో కలిసి ఈ క్లాసెస్ లో పాల్గొంటుంది.. ఆపరేషన్ థియేటర్లలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే సీనియర్ విద్యార్థి అయిన సైఫ్ ఆమె మీద తరచుగా వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని ప్రీతీ తండ్రి నరేందర్ కు తెలియజేసింది. ఆయన వరంగల్ మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేఎంసి ప్రిన్సిపాల్ మోహన్ దాస్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. దీంతో గత మంగళవారం అనస్తీషియా డిపార్ట్మెంట్ నాగార్జున రెడ్డి సమక్షంలో సైఫ్ కు, ప్రీతికి కౌన్సిలింగ్ జరిగింది.
వరంగల్ కేఎంసీ వద్ద ఏబీవీపీ ఆందోళ.. సైఫ్‌ను ఉరితీయాలని డిమాండ్.. తీవ్ర ఉద్రిక్తత..
మంగళవారం నాడు ఎంజీఎం ఆసుపత్రిలో ప్రీతి నైట్ డ్యూటీ లో ఉంది. డ్యూటీలో భాగంగా రాత్రి 12 గంటల వరకు రెండు ఆపరేషన్ లో ఆమె పాలుపంచుకుంది. ఆ తర్వాత బుధవారం తెల్లవారుజామున తనకు కొంత స్వస్థతగా ఉందని.. తలనొప్పిగా ఉందని,చాతిలో నొప్పి వస్తుందని చెప్పింది. అందుకుగాను స్టాఫ్ నర్స్ ను జోఫర్, ట్రెమడాల్ ఇంజక్షన్ కావాలని అడిగింది. ఆ తర్వాత ఉదయం ఏడు గంటల సమయంలో తోటి వైద్యులకు ఆమె డాక్టర్స్ రూమ్ లో అపస్మారక స్థితిలో కనిపించింది. దీంతో ఆమె గుండెపోటుకు గురైందని గుర్తించారు. వెంటనే సిపిఆర్ చేసి.. గుండె తిరిగి పని చేసేలా చేశారు. ఆ తర్వాత అవసరమైన చికిత్స ప్రారంభించారు.
ఎంత చేసినా ఆమె ఆరోగ్య పరిస్థితి సీరియస్ గానే ఉండడంతో ఎంజీఎం ఆస్పత్రి నుంచి ప్రీతిని బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రికి ఎంజీఎం ఉన్నతాధికారులు తరలించారు. ప్రాథమికంగా ప్రీతి రెమడాల్ ఇంజక్షన్ ఓవర్డోస్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిందని అందరూ భావించారు. అయితే.. అపస్మారక స్థితిలో ప్రీతి కనిపించిన డాక్టర్స్ రూంలో సక్సినైల్ కోలైన్, మెడజోలం, పెంటనీల్ ఇంజక్షన్ల వాయిల్స్ దొరకడం అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.
బ్రౌజింగ్ హిస్టరీలో షాకింగ్ విషయాలు..
ప్రీతి ఫోన్లోని బ్రౌజింగ్ హిస్టరీ ప్రకారం ఆమె గూగుల్ లో సక్సినైల్ కోలైన్ ఇంజక్షన్ గురించి వెతికినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనల నేపథ్యంలో ప్రీతి ఏ ఇంజక్షన్ తీసుకుంది అని తేల్చేందుకు ఆమె రక్త నమూనాలను టాక్సీకాలజీ పరీక్షలకు పంపించారు. ఇక, ప్రీతి ఆత్మహత్యాయత్నం తర్వాత వరంగల్ నుంచిహైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తీసుకువచ్చే సమయంలో దాదాపుగా మూడుసార్లు ఆమె గుండె ఆగిపోవడంతో సిపిఆర్ చేస్తూ గుండె తిరిగి కొట్టుకునేలా చేస్తూ తీసుకు వచ్చారు. హైదరాబాదులోని నిమ్స్ కు చేరుకున్న తర్వాత ప్రీతిని పూర్తిగా ఎక్మో, వెంటిలేటర్ల మీదే ఉంచి చికిత్స అందించారు. ప్రీతికి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.
ప్రీతిని సైఫ్ చంపేశాడని ఆరోపణ.. కన్నీటిపర్యంతరం అవుతున్న కుటుంబం.. కాసేపట్లో అంత్యక్రియలు..
దీంతో ఐదుగురు వైద్యుల ప్రత్యేక బృందం ఆమెను నిరంతరం పర్యవేక్షించింది. విషపూరితమైన ఇంజక్షన్ తీసుకోవడం వల్ల శరీరంలోని చాలా అవయవాలు దెబ్బతిన్నాయి. ఆ ఇంజక్షన్ ప్రభావం మెదడుపైనా పడిందని వైద్యులు గుర్తించారు. ఆమెను ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడేసేందుకు వైద్యుల బృందం ఐదు రోజులపాటు అన్ని విధాలుగా తీవ్ర ప్రయత్నాలు చేసిందిజ కానీ ఫలితం దక్కలేదు.
ఆడియో సంచలనం..
ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి ముందు ప్రీతి తన తల్లికి ఫోన్ చేసి మాట్లాడింది. తన సీనియర్ అయిన సైఫ్ తనను వేధిస్తున్నాడంటూ తల్లికి చెప్పుకుంది. తను ఒక్కదాన్నే కాదని తన లాంటి చాలామంది జూనియర్స్ ను అలాగే వేధిస్తున్నాడని చెప్పుకొచ్చింది. సీనియర్లు అందరూ ఒకటేనని వారి దృష్టికి తీసుకువెళ్లినా ఏమీ జరగదని వాపోయింది.ఒకవేళ సైఫ్ మీద తాను వారికి ఫిర్యాదు చేస్తే తనకు ఏమీ నేర్పించరని.. దూరం పెడతారని ఆవేదన చెందింది. ఈ ఆడియో శుక్రవారం వెలుగు చూసింది.
డెడ్ బాడీని ఇలాగే ప్యాక్ చేసి పంపించేయమంటారా?...
ఆదివారం రాత్రి ప్రీతి మృతి చెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించడంతో నిమ్స్ దగ్గర.. ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దీనిమీద నిమ్స్ వైద్యులు అసహనం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని చూసి సంతకం చేయాలని వైద్యులు కోరగా ప్రీతి తల్లిదండ్రులు ఆమె మృతికి కారణం ఏంటో చెప్పేదాకా తమ సంతకం చేయబోమని.. తమ కూతురిని మృతికి తగిన న్యాయం జరిగేదాకా రాబోమని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే.. విసుగెత్తిన ఓ వైద్యుడు ‘అలాగైతే.. డెడ్ బాడీని ఇలాగే ప్యాక్ చేసి పంపించేయమంటారా? అని వ్యాఖ్యానించినట్లుగా మీడియా కథనాలు వెలువడుతున్నాయి. దీంతో ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. వీటి మీద తల్లిదండ్రులు బంధువులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు.
ఖమ్మం జైలులో సైఫ్..
ప్రీతి మృతి కేసులో నిందితుడుగా ఉన్న సైఫ్ ను వరంగల్ మట్టెవాడ పోలీసులు ఈనెల 24వ తేదీన అరెస్ట్ చేశారు. మెడికల్ పీజీ సీనియర్ విద్యార్థి అయిన సైఫ్ మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అరెస్టు తర్వాత కోర్టులో హాజరు పరిచారు. కేసును పరిశీలించిన న్యాయమూర్తి సైఫ్ కు 14 రోజుల రిమాండ్ ను విధించారు. విచారణ ఖైదీగా ప్రస్తుతం సైఫ్ ఖమ్మం జైలులో ఉన్నాడు. ఎంజీఎం ఆస్పత్రి విధుల నుంచి సైఫ్ ను ఈ ఘటన నేపథ్యంలో సస్పెండ్ చేశారు. అతని మీద ఆరోపిస్తున్న నేరాలు రుజువైతే అతనిని కాలేజ్ నుంచి కూడా సస్పెండ్ చేస్తామని అధికారులు ప్రకటించారు. ప్రీతీ ఘటన మీద విచారణ నివేదికను వైద్యుల బృందం ఇప్పటికే డిఎంఈకి పంపించింది.
