బోయినపల్లి: సోనూసూద్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుని ఓ చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గుండెకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న చిన్నారికి హార్ట్ ఆపరేషన్ చేయడానికి సోనూ సూద్ ఆర్థికసాయం చేశాడు. అయితే ఇలా సోనూసూద్ సాయం చేసినా చిన్నారిని బ్రతికించలేకపోయాడు. 

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం జగ్గారావుపల్లి గ్రామానికి చెందిన పందిపెల్లి బాబు, రజిత దంపతుల కుమారుడు ఆద్విత్‌ శౌర్య గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. తండ్రి బాబు ఓ కొరియర్‌ సంస్థలో కొరియర్‌ బాయ్‌గా పనిచేస్తున్నాడు. కుమారుడు అస్వస్థతకి గురవ్వడంతో పరీక్షించిన వైద్యులు,చికిత్స కోసం రూ.ఏడు లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. దీనస్థితిలో ఉన్న బాబు తన కుమారుడి వైద్యానికి సాయం అందించాలని సోషల్‌ మీడియాలో పోస్టుల ద్వారా పేర్కొన్నాడు. 

 దీనిపై నటుడు సోనూ సూద్‌ స్పందించారు. ఆద్విత్‌ శౌర్య ఆపరేషన్‌కి అయ్యే ఖర్చులో వీలైనంత మొత్తం భరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఇన్నోవా ఆసుపత్రిలో చిన్నారికి వైద్య చికిత్స చేయించాలని పేర్కొన్నాడు. ఆపరేషన్‌ డాక్టర్‌ కోన సాంబమూర్తి చేస్తారని సోనూసూద్‌ చెప్పినట్టు శౌర్య తండ్రి బాబు తెలిపిన విషయం తెలిసిందే. సోనూ సూద్ తో పాటు మరికొందరు అందించిన సాయంతో శుక్రవారం చిన్నారికి హార్ట్ ఆపరేషన్ జరిగింది. 

అయితే శస్త్రచికిత్స తర్వాత బాలుడికి శ్వాస అందకపోవడంతో ఆదివారం కన్నుమూశాడు. చిన్నారిని కాపాడటానికి తమవంతు ప్రయత్నం చేశామని... కానీ పరిస్థితి  విషమించడంతో అద్విత్‌ కన్నుమూశాడని డాక్టర్లు తెలిపారు. దీంతో శోకసంద్రంలో మునిగిన తల్లిదండ్రులు స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.