తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కరోనా పాజిటివ్ రావడం మీద పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునే కేసీఆర్ ను కరోనా ఏమీ చేయలేదని నటుడు మోహన్ బాబు అన్నారు.

ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆ షిర్డీ సాయినాథున్ని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు రెండు రోజుల క్రితం కరోనా సోకిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఫామ్ హౌస్ లో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు.

సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతుండడం, వెంటనే నియంత్రణ చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్రంలో రాత్రి పూట కర్ప్యూ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

రోజూ రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని.. మంగళవారం నుంచి ఈ నెల 30వతేదీ వరకు (మే1న ఉదయం 5 గంటలవరకు) అమల్లో ఉంటుందని సీఎస్ సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 

తాజాగా తెలంగాణలో 6.542 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 20 మంది మరణించారు. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 898కేసులు నమోదయ్యాయి.