హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు సినీనటి, బ్లూ క్రాస్ సంస్థ వ్యవస్థాపకురాలు అక్కినేని అమల. వన్యప్రాణుల సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. 

రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసిన అమల వైల్డ్ లైఫ్ ఫిల్మ్ ఫెస్టివల్ కు రావాలంటూ ఆహ్వానించారు. అన్నపూర్ణ స్టూడియోలో ఈనెల 8 నుంచి 10 వరకు జరిగే ఇంటర్నేషనల్ వైల్డ్ లైఫ్ ఫిల్మ్ ఫెస్టివల్ కు రావాలని కోరారు. 

ఈ సందర్భంగా హరితహారం కార్యక్రమంలో భాగంగా మెుక్కలను నాటడాన్ని ఆమె ప్రత్యేకంగా ప్రశంసించారు. వన్యప్రాణుల పరిరక్షణకు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆమె కొనియాడారు. 

మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, రాష్ట్రాల నుంచి పెద్దపులులు ఆదిలాబాద్ జిల్లా పరిసర ప్రాంతాల్లోని అడవులకు వలస వస్తున్నాయని వాటి సంరక్షణకు మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా హైటికోస్ సంస్థ ఆధ్వర్యంలో పులుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను అమల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి వివరించారు.